విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మోల్టెన్ మెటల్ ల్యాడల్ నుంచి బకెట్లు కుప్పకూలాయి. ల్యాడల్‌లో ఉన్న ద్రవ లోహం అకస్మాత్తుగా కిందపడటంతో అక్కడ పనిచేస్తున్న 20 మంది కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. హాట్ మెటల్‌ను తరలించే ల్యాడిల్ పేలడం విశాఖ ఉక్కు చరిత్రలోనే కాదు దేశంలోనే ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.
ఈ ఘటనలో ప్రమాదస్థలిలో 9 మంది కార్మికులు మృతి చెందగా, మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2, ఎస్‌టీసీ-3 హీట్ ఎఫ్‌జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఉక్కుద్రవం లీకై మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది. 1500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ద్వారా ఉక్కుద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఉద్యోగులు, కార్మికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. తాజా ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టంతోపాటు స్టీల్‌ప్లాంట్‌కు ఆస్తి నష్టమూ వాటిల్లింది. ఎస్‌ఎంఎస్-1 ప్రాంగణం చాలావరకు అగ్నికీలల్లో చిక్కుకుంది. ఒక క్రేన్ కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత, విశాఖ ఎంపీ భరత్ పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు.
విశాఖ స్టీల్ప్లాంట్ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు అందిస్తున్నట్లుగా ఆయన ఎక్స్ ద్వారా ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. పలువురు కార్మికులు చనిపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆరా తీశారు. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని, ఘటనాస్థలానికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షిస్తానని వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరా తీశారని చెప్పారు.
బాధితులకు రూ 25 లక్షల పరిహారం
స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన ప్రమాద స్థలానికి చేరుకుని, పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మంది కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
అలాగే మృతుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షల చొప్పున సాయం అందజేస్తామని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ ఘోర ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.

More Stories
కేంద్రం సాయాన్ని, ప్రధాని మోదీ చేయూతను మరువలేం
భారతదేశపు తొలి నీటి అడుగున రోడ్డు- రైలు సొరంగం
బిజెపి రాబోయే తరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది