తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ పాలక మండలి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు ఎట్టకేలకు టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు. భవిష్యత్తులో అన్ని విషయాలను అధికారులకు వదిలేయకుండా జాగ్రత్త పడతామని ఆయన తెలిపారు. తొలుత శుక్రవారం ట్రస్ట్ బోర్డు సమావేశం అనంతరం ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదని అంటూ క్షమాపణ చెప్పనవసరం లేదని అంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిమాండ్ ను కొట్టిపారేసారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయవిచారణకు ప్రకటించారని, విచారణ అనంతరం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తోక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పడంలో తప్పులేదని కానీ క్షమాపణ చెప్పినంత మాత్రాన బతికిరారు కదా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత పిఠాపురం పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కఠినంగా స్పందించడంతో కొద్దీ సేపటికే క్షమాపణ చెప్పడం గమనార్హం.
డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో ఓ బాధ్యత గల వ్యక్తిగా ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పానని గుర్తు చేస్తూ తానే క్షమాపణ చెప్పినప్పుడు మీరు కూడా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, ఏఈవో క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అని స్పష్టం చేశారు. దానితో బిఆర్ నాయుడు దిగిరాక తప్పలేదు.
కాగా, మృతుల కుటుంబాలకు చెక్కులు సిద్ధం చేశామని, రేపు వారి ఇళ్లకు వెళ్లి అందజేస్తామని నాయుడు తెలిపారు. తొక్కిసలాటలో మృతిచెందిన ఆరుగురి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం అందజేయాలని టీటీడీ తీర్మానించిందని బీఆర్ నాయుడు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు భక్తులకు రూ 5 లక్షలు పరిహారం, స్వల్పంగా గాయపడ్డ 31 మంది భక్తులకు రూ 2 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం, వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రక్రియపై సమీక్షించారు. దర్శన విధానాలపైన కూడా టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ క్రమంలో భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ నాయుడు మాట్లాడుతూ మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు.
కాగా, తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం టీటీడీ బోర్డు సభ్యుల వ్యక్తిగతంగా ఆర్థిక సాయం ప్రకటించారు. టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్ల చెరో రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించగా ఎం.ఎస్.రాజు రూ.3 లక్షల ఆర్థిక సాయం ఇవ్వడానికి ముందుకొచ్చారు.
More Stories
తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నం
పోలవరం పనులపై పార్లమెంటరీ కమిటీ అధ్యయనం
తిరుపతి తొక్కిసలాటపై భక్తులలో ఆగ్రవేశాలు