ఆంధ్రప్రదేశ్ ఆశయాల సాధనకు కేంద్రంలోని తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, రాష్ట్రానికి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. చంద్రబాబు ‘విజన్-2047’కు సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక తొలిసారి విశాఖపట్నానికి వచ్చిన మోదీ రూ.2.08 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
విభజన హామీల్లో కీలకమైన విశాఖపట్నం రైల్వేజోన్‌తోపాటు గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్‌లకు శంకుస్థాపన చేశారు. పలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు.
“ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా విజన్. ఆంధ్రుల సేవ మా సంకల్పం. 2047నాటికి రాష్ట్రం 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న విజన్‌తో చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఈ ప్రయాణంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి భుజం కలిపి తోడుగా నిలుస్తుంది’’ అని మోదీ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
విశాఖలో తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని వివరించారు. ఐటీ, టెక్నాలజీలకు ఏపీ ప్రధాన కేంద్రం కానుందని తెలిపారు. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు వస్తుంటే దానిలో ఒకటి విశాఖకు కేటాయించామని ప్రధాని గుర్తు చేశారు. నక్కపల్లిలో బల్క్‌డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశామని కేవలం 3 రాష్ట్రాల్లోనే ఇలాంటి పార్కులు వస్తున్నాని వివరించారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశామని దీని ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 7 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని ప్రధాని తెలిపారు.
‘‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రైల్వేజోన్ ఎంతో కీలకం. వ్యవసాయ, వ్యాపార, పర్యాటక రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏపీలో వందశాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగింది. వందే భారత్ రైళ్లతోపాటు అమృత్ భారత్ సర్వీసులు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మౌలిక సదుపాయాల విప్లవంతోపాటు మెరుగైన కనెక్టివిటీతో ఏపీ ముఖచిత్రం మారబోతోంది. ఇప్పుడు ప్రారంభించిన పనులు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయి’’ అని ప్రధాని పేర్కొన్నార
‘బ్లూ ఎకానమీ’ని (సముద్ర వాణిజ్యం) మిషన్ మోడ్‌లో వినియోగించుకుంటామని ప్రధాని తెలిపారు. ఏపీలో మత్సకారుల ఆదాయం పెరిగేందుకు నిబద్ధతతో పని చేస్తున్నామని చెప్పారు. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, సముద్రంలో రక్షణ కోసం చర్యలు చేపట్టామని తెలిపారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అభివృద్ధిలో అందరినీ కలుపుకొని వెళ్తామని పేర్కొన్నారు.
‘‘అభివృద్ధి అన్ని రంగాల్లో జరగాలి. ఫలాలు అందరికీ అందాలి. నేడు ప్రారంభించిన ప్రాజెక్టులు ఏపీ ప్రజల భవిష్యత్తు, శ్రేయస్సుకు తోడ్పాడు అందించబోతున్నాయి’ అంటూ ప్రసంగాన్ని ముగించారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు