కస్టమర్ కేర్ మోసాలు.. మాల్‌వేర్‌తో ఖాతాలను ఖాళీ చేసే సైబర్ నేరాల విషయంలో బాధితులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అనుమతి లేని/మోసపూరిత ఆన్‌లైన్ లావాదేవీల కారణంగా తమ ప్రమేయం లేకుండానే ఖాతాలోని డబ్బు పోగొట్టుకున్న బాధితులు మూడ్రోజుల్లో ఫిర్యాదు చేస్తే బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది.
భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బీఐ) 2017 జూలై 6న ఇచ్చిన సర్క్యులర్‌లో పేర్కొన్నట్లుగా బాధితులు మూడ్రోజుల్లో ఫిర్యాదు చేస్తే థర్డ్‌పార్టీ యాప్, వ్యక్తుల ద్వారా జరిగే మోసాల విషయంలోనూ బాధితులకు ఊరట కలిగించాల్సిన బాధ్యత బ్యాంకులదేనని స్పష్టం చేసింది. గువాహటికి చెందిన పల్లభ్ భౌమిక్ అనే బాధితుడి విషయంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే బాధితుడు 2021లో ప్రపంచ దిగ్గజ గార్మెంట్స్ సంస్థ లూయీఫిలిప్ నుంచి రూ.4 వేలు వెచ్చించి, ఓ బ్లేజర్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాన్ని వాపస్ చేస్తానంటూ లూయీఫిలిప్ వెబ్‌సైట్‌లో కస్టమర్ కేర్‌కు సమాచారం ఇచ్చారు. తనకు రూ.4 వేలను వెనక్కి ఇవ్వాలని కోరారు. అయితే 2021లో లూయీఫిలిప్ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురై ఆ సైట్ నియంత్ర హ్యాకర్ల చేతికి వెళ్లిపోయింది.
వెబ్‌సైట్‌లో కస్టమర్‌కేర్‌ను సంప్రదించినట్లు బాధితుడు భావించినా దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలచుకుని, లూయీఫిలిప్ మేనేజర్ పేరుతో ఫోన్ చేశారు. ‘‘తప్పకుండా మీ సొమ్మును తిరిగి ఇస్తాం. అయితే మీరు మేము పంపే లింకు ద్వారా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి’’ అని సూచించారు. బాధితుడు ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయగానేఅతని ఎస్‌బీఐ ఖాతాలో ఉన్న రూ.94,204.80 గూగుల్‌పే ద్వారా సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ అయ్యింది.
తన ఖాతా ఖాళీ అవ్వడంతో బాధితుడు ఎస్‌బీఐ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి, జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. అయితే గూగుల్‌పే ద్వారా లావాదేవీలు జరిగినందున తాము బాధ్యులం కాదని కస్టమర్‌కేర్ సిబ్బంది సమాధానమిచ్చారు. దాంతో బాధితుడు గువాహటి పోలీసులు, అసోం సీఐడీ సైబర్ క్రైమ్ సెల్, జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు.
ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించినా న్యాయం జరగకపోవడంతో గువాహటి హైకోర్టును ఆశ్రయించారు. ఈలోగా నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. నేరం జరిగిన 24 గంటల్లోనే బాధితుడు ఫిర్యాదు చేశారని, ఎస్‌బీఐదే లోపమని హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. అతను కోల్పోయిన రూ.94,204.80ని తిరిగి ఇచ్చేయాలని తీర్పునిచ్చింది.
ఆ తీర్పుపై ఎస్‌బీఐ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. బాధితుడు గూగుల్‌పే ద్వారా డబ్బును బదిలీ చేశాడని, అతనికి ఓటీపీ కూడా వచ్చిందని బ్యాంకు తరఫు న్యాయవాదులు వాదనలను వినిపించారు. అయిత బాధితుడి పక్షానే న్యాయం ఉండడంతో ఎస్‌బీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఎస్‌బీఐనే తప్పుబట్టింది.
‘‘ఎస్‌బీఐ వద్ద అధునాతన సాంకేతికత ఉంటుంది. అనుమతి లేని/మోసపూరిత ఆన్‌లైన్ లావాదేవీలను గుర్తించి, నియంత్రించే అవకాశాలుంటాయి. బాధితుడి ప్రమేయం లేకుండానే ఆయన ఖాతాలోని సొమ్ము బదిలీ అయ్యింది. కాబట్టి.. ఎస్‌బీఐ అతనికి పరిహారంగా మొత్తం సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందే’’ అని తీర్పునిచ్చింది.
అదే సమయంలో బ్యాంకు ఖాతాదారులు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓటీపీని ఇతరులకు చెప్పినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఖాతాదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
More Stories
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!