నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ బుధవారం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తద్వారా ప్రభుత్వ ఏర్పాటుపై గత రెండు రోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. విజయ్ ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 10 గంటలకు జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయలేరని చెబుతున్నారు.
ఇటీవల ముగిసిన తమిళనాడు ఎన్నికల్లో, రెండు ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకేలకు షాక్ ఇస్తూ, 108 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నూతన పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే)కు, కాంగ్రెస్, పలు ఇతర చిన్న పార్టీల మద్దతు లభించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. విజయ్‌కు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించగా పీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయుఎంఎల్ కూడా సుముఖంగానే ఉన్నాయి.
ఎఐఎడిఎంకె, కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు విజయ్ శిబిరానికి మద్దతు ప్రకటించి, ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించేందుకు ముందుకు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఎఐఎడిఎంకెలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. గత కొన్నేళ్లుగా పార్టీ వరుసగా నాలుగు ఎన్నికల పరాజయాలను చవిచూసిన నేపథ్యంలో, సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి వంటి సీనియర్ నాయకులు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని బహిరంగంగా వాదించారు.
టీవీకే అధినేత విజయ్‌ను కలిసిన అనంతరం కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రేపు జరిగే విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. నటుడిగా కెరీర్ ప్రారంభించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే), 234 మంది సభ్యులు కలిగిన తమిళనాడు అసెంబ్లీలో 108 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది.
అయితే మెజారిటీ మార్కుకు (118 స్థానాలు) ఇది 10 స్థానాలు తక్కువగా ఉంది. ఒక కీలక రాజకీయ పరిణామంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టీవీకేకి పూర్తి మద్దతు ప్రకటించింది. తద్వారా తమిళనాడులో డీఎంకేతో దశాబ్దాలుగా కొనసాగుతున్న తన పొత్తును కాంగ్రెస్ పరోక్షంగా తెంచుకుంది. టీవీకేతో తమ పొత్తు కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే పరిమితం కాదని, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల వంటి భవిష్యత్తు ఎన్నికలకు కూడా ఈ పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసిన టీవీకే, తన ఎమ్మెల్యేలను మామల్లపురంలోని ఒక ప్రైవేట్ విలాసవంతమైన రిసార్ట్‌కు తరలించింది. ప్రస్తుతం 50 మందికి పైగా శాసనసభ్యులు పూంజేరిలోని ఒక హోటల్‌లో బస చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ, మరికొందరు ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకుంటారని భావిస్తున్నారు.
కాంగ్రెస్ మద్దతుపై మండిపడ్డ డీఎంకే
కాంగ్రెస్ విజయ్ కు మద్దతు ఇవ్వడంపై డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై తీవ్రంగా తప్పుబట్టారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కాంగ్రెస్ వ్యవహారాన్ని వెన్నుపోటుగా అభివర్ణించారు. “ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దక్కిన ఆ 5 సీట్లు కేవలం డీఎంకేతో పొత్తు వల్లే వచ్చాయి. డీఎంకే అండ లేకపోతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా వచ్చేది కాదు..డిపాజిట్లు కూడా గల్లంతు అయ్యేవి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా ఇలాగే అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.
అయితే, తాజా పరిణామాలపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ తమ భాగస్వామ్య పార్టీలకు ఎవరితో కలిసి వెళ్లాలో నిర్ణయించుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ‘మేము (కాంగ్రెస్-డీఎంకే) చాలా ఎన్నికలు కలిసి పనిచేశాం. ఇవాళ కూ డా ఎన్నికల్లో కలిసి పోటీచేసి ఓటమి చవిచూశాం. ప్రతి పార్టీ తమకు ఏదైతే సరైనదని అనిపిస్తుందో అది చేసే హక్కు ఉంటుంది. ఇతరుల గురించి నేను చెప్పేమీ లేదు. మేము మాత్రం మా పోరాటం కొనసాగిస్తాం’ అని మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కనిమొళి తెలిపారు.

More Stories
2021లో బెంగాల్ లో హిందూ మహిళలపై భయంకర దాడులు మరవకండి
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళ ఓటమితో దేశంలో అస్థిత్వ సంక్షోభంలో ‘లెఫ్ట్’!