కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి 8.06 గంటల సమయంలో కుటుంబసభ్యులు ఆయన్ను ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు.
ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయనను కాపాడడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని, రాత్రి 9:51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. మన్మోహన్‌సింగ్‌కు భార్య గురుచరణ్, ముగ్గురు కుమార్తెలు ఉపీందర్, అమృత్, దమన్ ఉన్నారు.
దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్.. అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు.1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలకు పునాది వేశారు.
నెహ్రూ అంతటి వ్యక్తే స్వయంగా పిలిచినా.. ‘నేను పాఠాలు చెప్పుకొంటాను తప్ప, రాజకీయాల్లోకి రాను’ అన్న మన్మోహన్.. ప్రస్తుత పాకిస్థాన్‌లోని గహ్‌లో 1932 సెప్టెంబరు 26న గురుముఖ్ సింగ్ కోహ్లీ, అమృత్‌కౌర్ దంపతులకు జన్మించారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్థాన్ నుంచి ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ నగరానికి వచ్చింది. ఆ తర్వాత ఏడాదికే.. అంటే 1948లో అమృత్‌సర్‌కు వెళ్లి అక్కడ స్థిరపడింది.
మన్మోహన్ అక్కడే హిందూ కాలేజీలో చేరారు. పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ (1952లో), పీజీ (1954లో) పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జి వర్సిటీలో ఆర్థికశాస్త్రంలో ఆనర్స్ పూర్తిచేశారు. పాఠశాల స్థాయి నుంచి కేంబ్రిడ్జి దాకా.. చదువులో ఆయన ఎప్పుడూ టాపరే. స్కాలర్‌షి్‌ప్సతోనే ఆయన చదువులన్నీ సాగాయి. డాక్టరేట్ చేసిన తొలి భారత ప్రధాని కూడా ఆయనే.
కేంబ్రిడ్జిలో ఉన్నత విద్య పూర్తిచేసుకున్న అనంతరం భారతదేశానికి తిరిగివచ్చిన ఆయన.. పంజాబ్ వర్సిటీలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. మళ్లీ 1960లో ఇంగ్లండ్‌కు వెళ్లి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో డీఫిల్ చేశారు. ‘ఇండియాస్ ఎక్స్‌పోర్ట్ పెర్ఫార్మెన్స్, 1951-1960, ఎక్స్‌పోర్ట్ ప్రాస్పెక్ట్స్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్’ అనే అంశంపై డాక్టొరల్ థీసిస్ రాశారు. డీఫిల్ పూర్తయ్యాక మళ్లీ ఇండియాకు తిరిగొచ్చి పంజాబ్ వర్సిటీలో రీడర్‌గా పనిచేశారు. 1963 నుంచి 1965 దాకా ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా వ్యవహరించారు.
1966 నుంచి 1969 దాకా ‘యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవల్‌పమెంట్’కు పనిచేశారు. ఆర్థికవేత్తగా ఆయన ప్రతిభను గుర్తించిన అప్పటి కాంగ్రెస్ ఎంపీ లలిత్‌నారాయణ్ మిశ్రా ఆయన్ను విదేశీ వాణిజ్య శాఖలో సలహాదారుగా నియమించారు. బ్యూరోక్రాట్‌గా మన్మోహన్ ప్రస్థానం అలా ప్రారంభమైంది. 1969 నుంచి 1971 దాకా ‘ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’లో ప్రొఫెసర్‌గా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన పాఠాలు బోధించారాయన. 1972లో ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1980-1982 నడుమ ప్రణాళిక సంఘంలో పనిచేసిన మన్మోహన్‌ను 1982లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా నియమించారు. 1985 దాకా ఆయన ఆ పదవిలో కొనసాగారు. 1985-87 నడుమ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1987 నుంచి 1990 దాకా జెనీవాలోని ఎకనమిక్ పాలసీ థింక్ ట్యాంక్ ‘సౌత్ కమిషన్’కు సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు. 1990 నవంబరులో భారత్‌కు తిరిగొచ్చి అప్పటి ప్రధాని చంద్రశేఖర్‌కు ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 1991లో ప్రభుత్వం ఆయన్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా నియమించింది. 1991 జూన్‌లో మైనారిటీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు దేశాన్ని సంస్కరణల పథంలో నడపాలంటే మన్మోహన్ వంటి ఆర్థికవేత్త అవసరమని భావించి ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు! ఆయన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టేనాటికి మన దేశ ద్రవ్యలోటు జీడీపీలో 8.5 శాతానికి, కరెంటు ఖాతా లోటు 3.5శాతానికి దగ్గర్లో ఉన్నాయి. మన విదేశీ మారక నిల్వలు కేవలం 2వారాల దిగుమతులకు సరిపడా మాత్రమే (దాదాపు 100 కోట్ల డాలర్లు) ఉన్నాయి!!
అలాంటి ఆర్థిక వ్యవస్థను ఆయన ప్రధాని పీవీ సహకారంతో సంస్కరణల పథంలో నడిపించి గాడిన పెట్టారు. పర్మిట్‌రాజ్‌కు చుక్క పెట్టి.. ఆర్థికవ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ(ఎల్‌పీజీ) బాట పట్టించి దేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేశారు. 2009లో ప్రధానిగా ఆయన తొలి పదవీకాలం పూర్తిచేసే సమయానికి మన విదేశీ మారక నిల్వలు ఏకంగా 600 బిలియన్ డాలర్లకు చేరాయంటే నాడు ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలే అందుకు పునాదిరాళ్లనడంలో సందేహం లేదు.
అనూహ్య పరిస్థితుల్లో 2004 మే 22న ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన మన్మోహన్ సింగ్.. 2014 దాకా ఆ పదవిలో కొనసాగారు. ఆర్థిక మంత్రి హోదాలో కొనసాగించిన పాత ఒరవడినే అందిపుచ్చుకుని సంస్కరణల పథంలో ముందుకు సాగారు. దీంతో అనతికాలంలోనే మన ఆర్థిక వృద్ధిరేటు పెరగడం ప్రారంభించి.. 2007లో అత్యధికంగా 9 శాతం మైలురాయిని దాటింది.
2009లో ఆయన హయాంలోనే విద్యాహక్కుచట్టం అమల్లోకి వచ్చింది. ఏపీ (ఉమ్మడి), బిహార్, గుజరాత్, ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 8 ఐఐటీ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. అలా పదేళ్లపాటు ప్రధానిగా దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన మన్మోహన్ సింగ్ పదవీకాలం 2014 మే 17న ముగిసింది.
1991 అక్టోబరు 1 నుంచి 2024 దాకా 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన రాజకీయ ప్రస్థానం.. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీతో ముగిసింది. దేశ తొలి సిక్కు ప్రధానిగా.. నెహ్రూ తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యాక మళ్లీ ప్రధాని పదవి చేపట్టిన తొలి నేతగా.. నెహ్రూ, ఇందిరాగాంధీ, మోదీ తర్వాత ఎక్కువకాలం ప్రధాని పదవిలో ఉన్న నాయకుడిగా.. ఎన్నో ఘనతలు సాధించిన ఆయన దేశ ప్రజల మనోయవనికలపై తనదైన చెరగని ముద్ర వేశారు!
More Stories
అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
12-13 తేదీల్లో మోదీ అమెరికా పర్యటన