డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
 
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్‌ 9వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈనెల 9న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.

తెలంగాణలో సంక్రాంతి తరువాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రైతు బంధు విధివిధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే పలు అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అర్హులైన రైతులకే దక్కేట్లు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ బిల్లును సైతం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

డిసెంబర్ 9వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళణ, రైతు భరోసా వంటి కీలక అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం గురుకుల పాఠశాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, లగచర్ల ఘటన, రైతు భరోసా, బోనస్ వంటి అంశాలపై చర్చకు పట్టుపట్టే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారి మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ సమావేశం ముగియక ముందే వెళ్లిపోయారు.