బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణకై బాసటగా నిలవాలి

బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణకై బాసటగా నిలవాలి
 
* ఆర్ఎస్ఎస్ నేత భాగయ్య `సంఘిభవ సదస్సు’లో పిలుపు

బంగ్లాదేశ్‌లోని హిందువులను దాడులు, అత్యాచారాల నుండి కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, వారికి బాసటగా నిలబడాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) జాతీయ కార్యకారిణి సభ్యులు  భాగయ్య పిలుపిచ్చారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు యావత్ భారత దేశం అండగా నిలుస్తోందని, తమ సంఘీభావాన్ని తెలియజేస్తోందని ఆయన స్పష్టం చేశారు. 

  ‘హిందూ ఐక్య వేదిక’ (భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి) ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌లోని హిందువులకు మద్దతుగా బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో జరిగిన ‘సంఘీభావ సదస్సు’లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొంటూ తమ దేశంలో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ మతోన్మాద శక్తులు చేస్తున్న దాడులను నిరోధించడంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దేవాలయాలు ధ్వంసం, హిందువుల ఆస్తులను తగలబెట్టడంతోపాటు హిందువులపై మారణహోమం జరుగుతున్నా బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని భాగయ్య మండిపడ్డారు. ఇస్కాన్‌కు చెందిన స్వామి చిన్మయి కృష్ణదాస్‌ను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బంగ్లాదేశ్ హిందువులు ఆ దేశాన్ని వీడిపోకుండా పోరాడి ఆత్మగౌరవంతో అక్కడే ధైర్యంగా ఉండే రోజులు త్వరలో కచ్చితంగా వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత వెయ్యేళ్ల కాలంలో ఉగ్రవాద శక్తులు అనేక దేశాలను ధ్వంసం చేసినప్పటికీ, భారత్ మాత్రమే దానిని తట్టుకుని నిలిచిందని గుర్తు చేశారు. 
 
ఆ శక్తులు మన మందిరాలను కూల్చినా, మన తల్లులు, స్త్రీలను దారుణంగా అవమానించినా మనం తలవంచక, ఓటమిని అంగీకరించక, విజయం కోసం పోరాటాలు, బలిదానాలు చేస్తుండటమే ఇందుకు కారణమని భాగయ్య స్పష్టం చేశారు. హిందూ సమాజం జాగృతమవుతున్నప్పటికీ, మరింత ఐక్యత, బాధ్యతతో సంఘటితం కావాలన తెలిపారు. 
 
నేడు సుదీర్ఘ సంఘర్షణ కొనసాగుతోందని చెబుతూ ధైర్యాన్ని నూరిపోసిన శ్రీకృష్ణని భగవద్గీతను అనుసరించి ప్రతి పల్లె, పట్టణం, వీధి వీధినా ఈ పోరాటం సాగాలని భాగయ్య తెలిపారు. బంగ్లాదేశ్ హిందువుల సమైక్య పోరాటం తప్పక విజయం సాధిస్తుందంటూ పేర్కొంటూ ఒకనాడు జరిగిన దేశ విభజన కృత్రిమమేనని, తాత్కాలికంగా మాత్రమే విడిపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు సాంస్కృతికంగా భారతదేశపు అఖండ భూమి అని స్పష్టం చేశారు.

బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీ ప్రజల ప్రాథమిక హక్కులకు హామీ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ హిందువుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన భారత ప్రభుత్వాన్ని కోరారు.

బంగ్లాదేశ్ హిందువుల దైన్య స్థితి, ఇస్కాన్ సన్యాసి అరెస్ట్ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన త్రిదండి దేవనాథ జీయర్ స్వామి హిందూ సమాజం కోసం పోరాడుతున్న వీరులకు అభినందనలు తెలిపారు. అదే సమయంలో ధర్మశాస్త్రాలు శాంతిని ప్రబోధించినప్పటికీ ఆపత్కాలంలో రక్షించుకోవలసిన కర్తవ్యాన్ని కూడా తెలియజేశాయంటూ ఒక కథ ద్వారా కర్తవ్యాన్ని ప్రబోధించారు. 

సెక్యులరిజం గురించి మాట్లాడుతున్న ప్రభుత్వాలకు హైందవ దేవాలయాలపై అధికారమెందుకని నిలదీశారు. చర్చిలు, మసీదులను వదిలేసి హిందూ దేవాలయాల ఆదాయాన్ని ప్రభుత్వాలను నడిపించుకోవడానికి వాడుకుంటున్న తీరును ఖండించారు. అయితే హిందువుగా బతకాలి.. లేదంటే పోరాడి అమరులవ్వాలని పిలుపునిచ్చారు.

ఇస్కాన్‌కు చెందిన స్వామి మాధవ స్వామి మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ భక్తులపై తుపాకులు గుచ్చి చంపడానికి సిద్ధంగా ఉన్నారని, జైల్లో ఉన్న ఇస్కాన్ స్వాములకు ప్రసాదంగా శాకాహారాన్ని ఇచ్చినవారిని కూడా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి పెద్దలు కూడా మాట్లాడని పరిస్థితి ఉందంటూ బంగ్లాదేశ్‌లో ఇస్లాం, ఇస్కాన్‌తో పాటు అన్ని ధర్మాలూ సహజీవనం చేసే పరిస్థితి కల్పించాలని అక్కడి ప్రధానమంత్రి యూనస్‌కు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌ బర్ల సుందర్ రెడ్డి మాట్లాడుతూ హిందువులకు అన్యాయం చేసినవారు కనుమరుగయ్యేలా మన ప్రతిక్రియ ఉండాలని చెప్పారు. బంగ్లాదేశ్‌కి చైనా, పాకిస్తాన్ తోడయ్యాయని హెచ్చరించారు. క్రిమినల్ కేసులున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి యూనిస్‌కి గతంలో ఇచ్చిన నొబెల్ శాంతి బహుమతిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీహెచ్ పీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ అధ్యక్షత వహించారు.

స్వామి నారాయణ నీలకంఠ విద్యాపీఠం హరిదర్శన్ స్వామీజీ, స్వామి దుర్గానందపురి స్వామీజీ, బనారస్ బాబు స్వామిజీ, ఎమ్మెల్యే టి.రాజాసింగ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి, వీహెచ్ పీ నాయకులు రామరాజు, డాక్టర్ రామ్ సింగ్, డాక్టర్ సునీతారెడ్డి, పలు హిందూ సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులు  పాల్గొన్నారు.

మతోన్మాదంతో మతితప్పి, మానవత్వం మరచి ప్రవర్తిస్తున్న అక్కడి ఇస్లామిక్ మతఛాందసవాద శక్తులకు గట్టిగా బుద్ధి చెప్పితీరాలని బంగ్లాదేశ్ హిందువుల రక్షణ కోసం జరిగిన సంఘీభావ సభ పిలుపునిచ్చింది. హిందూ ధర్మ రక్షణ కోసం హిందువులంతా రోడ్లపైకి రావాలని, వక్ఫ్ బోర్డును తొలగించాలని, హిందూ-హిందూ భాయి భాయిగా కలసి పోరాడాలని ఆకాంక్షించింది.