తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సమిష్టి కృషి

తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సమిష్టి కృషి
 
* బీజేపీ ఎమ్యెల్యేలు, ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్ధేశం
 
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా ఇప్పటి నుంచే సమష్టిగా కృషి చేయాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్యెల్యేలు, ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. వారితో పార్లమెంట్ లో ప్రధాని బుధవారం  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర పథకాలు సమగ్రంగా అమలు చేసేలా పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు.
 
సమర్థవంతంగా ప్రాజెక్టుల అమలుకోసం క్రియాశీలకంగా పనిచేయాలని ప్రధాని సూచించారు. ప్రజాసమస్యల మీద ఎప్పుడూ పనిచేయాలని, ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని ఆయన చెప్పారు.  8 మంది లోక్ సభ సభ్యులు, రాజ్యసభ్యుడైన డాక్టర్ లక్ష్మణ్, 7 శాసన  సభ్యులు, ఒక ఎమ్మెల్సీ కలిశారు.  బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర రెడ్డి   కూతురు వివాహ పనులున్నందున హాజరు కాలేదు.
 
తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ వైపు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని భేటీ అనంతరం తన ఎక్స్ వేదికగా ఫోటోలతో సహా ప్రధాని ట్వీట్ చేశారు. గత బిఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయాందోళనలో ఇంకా ప్రజలు అలాగే ఉన్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన ప్రజలు బిజెపి పాలన కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. 
 
తెలంగాణలో బీజేపీ వేగంగా బలపడుతోందన్న మోదీ  కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడాలని బిజెపి నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ స్వరం గట్టిగా వినిపిస్తూనే ఉందని, తమ పార్టీ నేతలు బిజెపి అజెండాను గట్టిగా వివరిస్తూనే ఉంటారని ప్రధాని తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. ప్రజాసమస్యల మీద పోరాడండి, కేంద్రప్రభుత్వ పథకాలు అమలుచేయండి, క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మకంగా పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారని చెబుతూ ఆ మార్గంలోనే తాము ముందుకెళ్తున్నామని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలిపారు. 
 
బీజేపీ పార్టీ తరపున రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలమీద డిసెంబర్ 1 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు. ఎన్నికలకు ముందు హామీలు, డిక్లరేషన్లు, గ్యారెంటీలు, సబ్ గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గుర్తు చేస్తూ సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి దాడి చేస్తున్నారని విమర్శించారు.