తాత్కాలికంగా ఇథనాల్‌ పరిశ్రమ పనుల నిలిపివేత

తాత్కాలికంగా ఇథనాల్‌ పరిశ్రమ పనుల నిలిపివేత
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌ లో ఇథనాల్‌ పరిశ్రమ రద్దు డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం  స్పందించింది. రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దిగి వచ్చింది. తక్షణమే పనులు నిలిపివేయాలపి జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ సంబంధిత అధికారులను, పరిశ్రమ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు.

ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు గత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులను పునః సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అనుకుంటోంది. అవసరమైతే పరిశ్రమ అనుమతులను రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ సూచనల మేరకు ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు.

ఇథనాల్‌ పరిశ్రమ వల్ల తమ పంట భూములు పనికిరాకుండా పోతాయని, గ్రామస్థులు అనారోగ్యం బారిన పడుతారని ఆందోళన వ్యక్తం చేస్తూ నాలుగు గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎనిమిది నెలలుగా ఇథనాల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్మల్‌ జిల్లాలో రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. ఇందులో భాగంగా మంగళవారం నుంచి ప్రారంభించిన మహాధర్నా ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ గ్రామస్థులు చేపట్టిన నిరసనలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఆందోళనకారులు పోలీసులపై దాడి చేయగా వారు పరుగులు తీశారు. ఈ క్రమంలో మహిళలు సైతం పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలంటూ దీనిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరసనను మరింత ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరించారు. 

నవంబర్ 26న కూడా జాతీయ రహదారిపై రాస్తారోకో చేయగా అక్కడికి వచ్చిన ఆర్డీవోను అడ్డుకుని కారుకి నిప్పంటించే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు మంగళవారం రహదారిపైనే వంటావార్పు కార్యక్రమం నిర్వహించి అక్కడే భోజనం చేశారు. రాత్రి సైతం నిరసన కొనసాగించారు. 

ఈ నేపథ్యంలో రాస్తారోకో చేస్తున్న రైతులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చర్చలకు రావాలని పిలవడంతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులతో జిల్లా కలెక్టర్ చర్చలు జరిపారు. రెండు రోజులుగా జాతీయ రహదారిని దిగ్బంధిచి నిరసన తెలుపుతున్న విషయాన్ని సిఎంఓ ఆఫీస్‌కు నివేదిక అందించామని, ఇథనాల్ ఫ్యాక్టరీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 

రైతులు అసత్య పుకార్లను నమ్మవద్దని, ఎవరైనా అసత్యాలను ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎస్‌పి జానకి షర్మిల దిలావర్‌పూర్‌లో రాస్తారోకో నిర్వహిస్తున్న రైతుల వద్దకు వచ్చి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను రైతులకు వివరిస్తూ ఎవరూ ఆందోళన చెందవద్దని, ఫ్యాక్టరీని తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ఈ ప్రకటనతో గ్రామస్థులు బాణసంచా పేలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. ధర్నా, రాస్తారోకో సైతం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.