హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ ఆమోదం

హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ ఆమోదం

హెజ్‌బొల్లాతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కాల్పుల విమరణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈమేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. “శుభవార్త. నేను ఇజ్రాయెల్‌- లెబనాన్‌ల ప్రధానులతో మాట్లాడాను. టెల్‌అవీవ్‌- హెజ్‌బొల్లాల మధ్య విధ్వంసకర ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి అమెరికా చేసిన ప్రతిపాదనను వారు అంగీకరించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం” అని బైడెన్‌ రాసుకొచ్చారు.

మరోవైపు, ఈ పరిణామాలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కూడా స్పందించారు. ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్‌ పైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. “మేం ఒప్పందాన్ని అమలు చేస్తాం. కానీ, ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తాం. విజయం సాధించేవరకు మేం ఐక్యంగా పోరాడుతాం” అని నెతన్యాహు వెల్లడించారు. 

ఈ ఒప్పందంలో అమెరికా, ఫ్రాన్స్ భాగస్వామ్యం వహించాయి. కాల్పుల విరమణకు సంబంధించి లెబనాన్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ హిజ్బుల్లా ప్రతినిధి ఎవరూ లేరు. ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లాల మధ్య కాల్పుల విరమణకు ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు నెతన్యాహు పేర్కొన్నారు. తమ సైనికుల క్షేమం, హమాస్‌ను ఒంటరిదాన్ని చేయాలనేది వారి ముఖ్య ఉద్దేశంగా తెలిపారు.

“ఆయుధాల పంపిణీలో పెద్ద జాప్యం జరిగిన విషయం రహస్యం కాదు. ఈ జాప్యాలు త్వరలో పరిష్కరమవుతాయి. మా సైనికుల క్షేమమే ముఖ్యం. మా కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి మరింత అధునాతన ఆయుధాల సరఫరాను అందుకోనున్నాం. యుద్ధం రెండో రోజు నుంచి హమాస్ పక్షాన పోరాడాలని హెజ్‌బొల్లా నిర్ణయించింది. హమాస్‌పై మరింత ఒత్తిడి తెచ్చి మా బందీలను విడిపించాలి” అని నెతన్యాహు వెల్లడించారు. 

అయితే, ఇరాన్‌పై మరింత దృష్టి సారించాలనేది మరో కారణమనట్లు తెలుస్తోంది. అయితే, నెతన్యాహు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ కాల్పుల విరమణలో అమెరికా కీలక పాత్ర పోషించింది. ఈ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని అధ్యక్షుడు బైడెన్‌ ఆకాంక్షించారు. 60 రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్‌ క్రమంగా తన బలగాలను ఉపసంహరించుకోవాల్సి ఉండగా లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుందని తెలిపారు.

ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ 10-1 ఓట్ల తేడాతో ఆమోదించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాటితో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. యుద్ధాన్ని తాత్కాలికంగా ముగించేందుకు ఈ ఒప్పందాన్ని రూపొందించినట్లు బైడెన్ వెల్లడించారు. హిజ్బుల్లా, ఇతర ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ భద్రతలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పారు.

ఈ ఒప్పందం ప్రకారం రెండు నెలల పాటు కాల్పుల విరమణ పాటించాలి. 60 రోజుల్లోగా లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ సేనలు, సరిహద్దుల్లో హెజ్బొల్లా వెనక్కి వెళ్లాలి. లెబనాన్ సైన్యం, ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంటాయి. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం పర్యవేక్షించనుంది. ఒకవేళ, హెజ్బొల్లా ఉల్లంఘిస్తే ఇజ్రాయేల్‌ చర్యలు దిగొచ్చు. అయితే, ఈ నిబంధనను హెజ్బొల్లా సహా లెబనాన్ అధికారులు మాత్రం వ్యతిరేకించారు.

ఇక, ఈ కాల్పుల విమరణ ఒప్పందం బుధవారం నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు అమెరికా, టర్కీ, ఈజిప్టు, ఖతార్‌ దేశాల నాయకులతో చర్చలు జరుపుతామని బైడెన్‌ వివరించారు. లెబనాన్‌ తాత్కాలిక ప్రధాని నజీబ్‌ మికాటి ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. విరమణ ఒప్పంద ప్రకటన అనంతరం ఆయన బైడెన్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.