అమెరికాలోకి అక్రమ వలసదారులను, మాదక ద్రవ్యాల ప్రవేశాన్ని అరికట్టేందుకు కెనడా, మెక్సికో నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై 25 శాతం సుంకాన్ని, చైనా వస్తువులపై 10 శాతం సుంకాన్ని తాను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. జనవరి 20న అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తన ప్రథమ చర్యలలో భాగంగా ఈ మూడు దేశాలపై సుంకాన్ని విధిస్తూ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేస్తానని తన సామాజిక మాధ్యమం ట్రూత్ లో వరుసగా పోస్టు చేసిన ట్వీట్లలో ట్రంప్ వెల్లడించారు.
దేశం ఎన్నడూ చూడని విధంగా మెక్సికో, కెనడా నుంచి వేలాదిమంది వలసవస్తూ తమ వెంట నేరాలను, డ్రగ్స్‌ను తీసుకువస్తున్నారని ట్రంప్ తెలిపారు. ఈ క్షణం కూడా వేలాది మందితో మెక్సికో నుంచి ఒక వాహనశ్రేణి వస్తోందని, ప్రస్తుతం తెరచి ఉన్న మన సరిహద్దుల ద్వారా నిరాటంకంగా దేశంలోకి చొరబడనున్నదని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాలోకి అక్రమ వలసవాదులు, డ్రగ్స్ చొరబాటు ఆగేంతవరకు తాను విధించనున్న సుంకం అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. దీర్ఘకాలంగా అమెరికాను పట్టి పీడిస్తున్న ఈ సమస్యను పరిష్కరించగల అధికారం, హక్కు మెక్సికో, కెనడాకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తమ అధికారాన్ని ప్రయోగించాలని ఆ దేశాలను డిమాండు చేస్తున్నామని, అది జరగనంత వరకు ఆ రెండు దేశాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అమెరికాలోకి డ్రగ్స్ ప్రవాహాన్ని అడ్డుకోవడంలో చైనా విఫలమైందని ట్రంప్ ఆరోపించారు.
భారీ మొత్తంలో జరుగుతున్న డ్రగ్స్ సరఫరా గురించి చైనాతో తాను అనేక సార్లు చర్చించానని, అయినప్పటికీ ఫలితం లేదని ఆయన తెలిపారు. అమెరికాకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన డ్రగ్స్ డీలర్లకు గరిష్ఠ స్థాయిలో శిక్షను..మరణ శిక్ష సైతం విధిస్తామని చైనా ప్రతినిధులు చెప్పారని గుర్తు చేశారు. అయితే దురదృష్టవశాత్తు దీన్ని అమలు చేయకపోవడంతో మెక్సికో మీదుగా తమ దేశంలోకి డగ్స్ వెల్లువెత్తుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఈ ప్రవాహం అగేంతవరకు అమెరికాలోకి వచ్చే అన్ని చైనా వస్తువులపై అదనంగా 10 శాతం సుంకాన్ని అమలు చేస్తామనిట్రంప్ తెలిపారు.
More Stories
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్
సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు
చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు