యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ సిద్ధం 

యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ సిద్ధం 
మధ్యప్రాచ్యంలో మూడు నెలలుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించే దిశగా ఒక ఊహించని భారీ మలుపు చోటుచేసుకుంది. అగ్రరాజ్యం అమెరికాతో సాగుతున్న శాంతి చర్చల్లో భాగంగా తన వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైన సుసంపన్న యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు ధృవీకరించారు. 
 
శ్వేతసౌధం, టెహ్రాన్ మధ్య శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరిందని, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరుదేశాలు సిద్ధం అవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) నివేదికల ప్రకారం ఇరాన్ వద్ద ప్రస్తుతం ఆయుధ స్థాయికి అత్యంత సమీపంలో ఉండే (60 శాతం స్వచ్ఛత కలిగిన) దాదాపు 400 కిలోల సుసంపన్న యురేనియం నిల్వలు ఉన్నాయి.
 
దీనితో ఇరాన్ ఒకటి కంటే ఎక్కువ అణుబాంబులను తయారు చేయగలదని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నిల్వలను పూర్తిగా వదులుకోవాలని అమెరికా పట్టుబట్టడంతో రాబోయే 30 నుంచి 60 రోజుల్లో దీనిపై తుది చర్చలు జరపడానికి ఇరాన్ అంగీకరించింది. నిజానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఈ అణు నిల్వలను దేశం దాటించవద్దని గతంలో కఠిన ఆదేశాలు ఇచ్చారు. 
 
అయితే ప్రాథమిక ఒప్పందంలోనే యురేనియంపై హామీ ఇవ్వాలని, లేదంటే చర్చలు నిలిపివేసి మళ్లీ సైనిక దాడులు ప్రారంభిస్తామని అమెరికా హెచ్చరించడంతో ఇరాన్ వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ నిల్వలను అణుధూళిగా అభివర్ణిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని చెబుతూ వస్తున్నారు. ఐతే యురేనియం నిల్వలను ఏం చేయాలనే విషయమై మున్ముందు మరిన్ని చర్చలు జరగనున్నాయి.

అంతకుముందు అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. తమపై బలవంతంగా రుద్దిన యుద్ధానికి ముగింపు పలకడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికారప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ తెలిపారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు అమెరికాతో అవగాహనా ఒప్పందాన్ని చేసుకునే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.

లెబనాన్‌తోసహా అన్ని యుద్ధాలను పూర్తిగా ముగించడంపైనే చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. మొదట ప్రాథమిక ఒప్పందం చేసుకొని ఆ తర్వాత 60 రోజుల్లో తుది ఒప్పందానికి వస్తామని ఇరాన్ వివరించింది. ముఖ్యంగా తమ ఓడరేవుల ముట్టడిని ఎత్తివేయాలని, విదేశాల్లో స్తంభించిజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలనే రెండు ప్రధాన డిమాండ్లను అమెరికా ముందుంచినట్లు బఘాయ్ పేర్కొన్నారు. శాంతి చర్చల్లో అణు అంశంపై చర్చలు జరగడం లేదని, రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఈ ఒప్పందంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.

ఈ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు చెందిన బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ నిధులను విడుదల చేయడానికి అమెరికా అంగీకరించింది. అయితే దేశ పునర్నిర్మాణానికి సంబంధించిన మెజారిటీ నిధులను అణు ఒప్పందం పూర్తిగా ముగిసిన తర్వాతే విడుదల చేస్తామని స్పష్టం చేయడం ద్వారా ఇరాన్ చర్చల నుంచి తప్పుకోకుండా అమెరికా చెక్ పెట్టింది.