పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి .. 24 మంది మృతి

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి .. 24 మంది మృతి

బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఆదివారం ఉదయం క్వెట్టా-చమన్ ఫాటక్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.  ఈ పేలుడు ధాటికి 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌ సమీపంలోని సిగ్నల్‌ దాటుతున్న సమయంలో పేలుడు పదార్థాలతో ఉన్న ఒక వాహనం వచ్చి రైలు బోగీని బలంగా ఢీకొట్టింది.

దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో అత్యధికులు సైనికులే ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.  పేలుడు తీవ్రతకు రైలు పాక్షికంగా దెబ్బతినడమే కాకుండా, పరిసరాల్లో ఉన్న 10కి పైగా వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన జరిగిన వెంటనే పాకిస్తాన్ భద్రతా బలగాలు, అత్యవసర రెస్క్యూ టీమ్‌లు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. 

క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా క్వెట్టా ప్రాంతంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లాల్సిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు స్టేట్మెంట్‌లోనే నిలిపివేశారు. పేలుడు తీవ్రతతో వాహనాలకు చెందిన గ్లాస్‌లు, వాహన భాగాలు ఎగిరిపోయి సమీపంలోని బిల్డింగ్‌లపై పడ్డాయి. పేలుడు జరగగానే స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. 

కాగా, ప్రమాద స్థలంలో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు, ప్రజలు ఎవరూ అక్కడ గుమిగూడవద్దని పాక్ హోం మంత్రి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.అధికారులు క్వెట్టాలోని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి సెలవులు రద్దు చేసి, అందరూ విధులకు హాజరు కావాలని ఆదేశించారు. 

బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సిటీ అంతా హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావొద్దని, ప్రమాదం జరిగిన ప్రదేశానికి రావొద్దని ఆదేశించారు.  ఈ దారుణ ఉగ్రదాడికి తామే బాధ్యులమని నిషేధిత సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్ సైనిక సిబ్బందిని తరలిస్తున్న రైలునే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు బిఎల్ఏ ప్రతినిధి జీయాండ్ బలోచ్ వెల్లడించారు.