వైట్‌హౌస్ వద్ద కాల్పుల కలకలం.. నిందితుడు కాల్చివేత 

వైట్‌హౌస్ వద్ద కాల్పుల కలకలం.. నిందితుడు కాల్చివేత 
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ వద్ద కాల్పుల కలకలం రేగింది. శనివారం సాయంత్రం వైట్‌హౌస్ వెలుపల ఉన్న ఒక అత్యున్నత భద్రతా చెక్‌పాయింట్ వద్దకు వచ్చిన ఓ దుండగుడు ఒక్కసారిగా అధికారులపైకి కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన యూఎస్ సీక్రెట్ సర్వీస్ బలగాలు ఎదురు కాల్పులు జరిపి నిందితుడిని అక్కడికక్కడే హతమార్చాయి.  
 
ఈ కాల్పుల ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ లోపలే ఉన్నారు. అయితే ఈ దాడి వల్ల అధ్యక్షుడి భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని భద్రతా వర్గాలు తెలిపాయి.  మేరీల్యాండ్‌కు చెందిన 21 ఏళ్ల నసీర్ బెస్ట్ అనుమానితుడని పలు వర్గాలు ధృవీకరించాయి. అతని సోషల్ మీడియా ఖాతాలలో, అధ్యక్షుడు ట్రంప్‌పై హింసకు పాల్పడతామని బెదిరిస్తున్నట్లు కనిపించే ఒక పోస్ట్, తాను దేవుని కుమారుడినని రాసుకున్న మరో పోస్ట్ ఉన్నాయి. 
 
ఈ విషయంపై సమాచారం అందుకున్న ఆరుగురు సీనియర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బెస్ట్‌ను అనుమానితుడిగా గుర్తించారు. బెస్ట్‌కు స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో గతంలోనే సంబంధాలు ఉన్నట్లు నమోదు కాగా, అతనికి మానసిక ఆరోగ్య సమస్యల చరిత్ర కూడా ఉందని అధికారులు తెలిపారు. ఫెడరల్ అధికారులకు బెస్ట్ కొత్తేమీ కాదు.  అధికారులను సమీపించి బెదిరింపులకు పాల్పడిన తర్వాత, జూన్ 26, 2025న వైట్ హౌస్ సమీపంలో ఏజెంట్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అలాగే, జూలై 10, 2025న అదే ప్రాంగణంలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించినందుకు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సుపీరియర్ కోర్టులో దాఖలు చేసిన ఒక కోర్టు పత్రం ప్రకారం, జూలై 10న వైట్ హౌస్ సమీపంలోని నిషేధిత ప్రాంతంలోకి నడిచి వెళ్లిన తర్వాత, చట్టవిరుద్ధంగా ప్రవేశించిన ఆరోపణపై బెస్ట్‌ను అరెస్టు చేశారు.
 
యూఎస్ సీక్రెట్ సర్వీస్ వెల్లడించిన ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ ఎన్‌డబ్ల్యూ వద్ద ఉన్న వైట్‌హౌస్ సెక్యూరిటీ బూత్ వైపు నడుచుకుంటూ వచ్చాడు.  అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారుల సమీపానికి రాగానే తన బ్యాగులోంచి తుపాకీని బయటకు తీసి ఒక్కసారిగా సెక్యూరిటీ బూత్‌పైకి వరుసగా కాల్పులు ప్రారంభించాడు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దాదాపు 15 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పుల శబ్దాలు వినిపించాయి.  అధికారులు కూడా తక్షణమే ఎదురు కాల్పులకు దిగడంతో తీవ్రంగా గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.  అయితే అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘోర ప్రమాదంలో అక్కడ నిలబడి ఉన్న ఒక సాధారణ పౌరుడికి కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి.
అయితే ఆ వ్యక్తికి తగిలిన బుల్లెట్ నిందితుడు కాల్చినదా, లేక అధికారుల ఎదురు కాల్పుల్లో తగిలిందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని భద్రతా సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు వైట్‌హౌస్ ప్రెస్ టెంట్‌లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఒక్కసారిగా తూటాల శబ్దాలు వినబడటంతో ప్రాణాలు అరచేత బట్టుకుని పరుగులు తీశారు.
ఏబీసీ న్యూస్ సీనియర్ కరస్పాండెంట్ సెలీనా వాంగ్ తాను సెల్‌ఫోన్‌లో సోషల్ మీడియాలో పోస్టే చేసేందుకు ఓ వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలోనే డజన్ల కొద్దీ తుపాకీ శబ్దాలు వినిపించాయని, భయంతో అక్కడే కిందకు వంగి ఆశ్రయం పొందానని తెలిపారు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే అధికారులు జర్నలిస్టులను ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోకి తరలించి వైట్‌హౌస్‌ను కాసేపు లాక్‌డౌన్ చేశారు. 
ఈ దారుణ ఘటనపై ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎఫ్‌బీఐ బలగాలు రంగంలోకి దిగాయని, సీక్రెట్ సర్వీస్ అధికారులతో కలిసి సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. మరోవైపు నెల రోజుల క్రితమే ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ వేదిక వద్ద కూడా ఇలాంటి హత్యాయత్నం జరగడం, అలాగే మే 4వ తేదీన వాషింగ్టన్ మానిమెంట్ వద్ద కాల్పులు చోటుచేసుకోవడం అమెరికా రక్షణ వ్యవస్థల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.