అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2025లో కీలకమైన అడ్మిషన్ల సమయంలో భారతీయులకు జారీ చేసిన అమెరికా విద్యార్థి వీసాల సంఖ్య 62% తగ్గినట్టు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్(వలస వ్యతిరేక విధానాలను సమర్థించే ఒక మేధోసంస్థ) విశ్లేషించిన గణాంకాలు పేర్కొన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల పరిశీలన ప్రక్రియను కఠినతరం చేయడం, కఠినమైన వలస విధానాలను ప్రవేశపెట్టడం వల్ల ఈ తగ్గుదల చోటుచేసుకుంది.
అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థులలో భారత్, చైనాకు చెందినవారే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) గణాంకాల ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో భారత్ నుండి 3,63,019 మంది, చైనా నుండి 2,65,919 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ దేశంలోని మొత్తం 11.7 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో వీరిద్దరి వాటా 53%గా ఉంది.
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అత్యధిక సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ చేసే 2025 మే-ఆగస్టు మధ్య కాలంలో భారతీయ పౌరులకు అమెరికా 22,149 ఎఫ్-1 వీసాలను జారీచేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో అదే కాలంలో జారీ చేసిన 58,694 వీసాలతో పోలిస్తే ఇది 62% తక్కువ. అలాగే 2017-19, 2021-24 మధ్య నమోదైన సగటుతో పోలిస్తే ఇది 60% తక్కువ.
అదే కాలంలో 2024 నాటి 61,075 సంఖ్యతో పోలిస్తే ఇది 34% తగ్గింది. గత కొన్ని సంవత్సరాల సగటు కంటే 46% తక్కువగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. భారతీయ, చైనీస్ విద్యార్థులకు జారీచేసే వార్షిక విద్యార్థి వీసాలలో దాదాపు మూడు వంతులు మే-ఆగస్టు కాలంలోనే జారీ అవుతాయి. తద్వారా ప్రతి విద్యా సంవత్సరానికి ముందు డిమాండ్‌ను అంచనా వేయడానికి ఇది అత్యంత కీలకమైన సూచికగా నిలుస్తున్నది.
విద్యార్థి వీసాల సంఖ్య తగ్గడానికి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) కార్యక్రమానికి సంబంధించిన ఆందోళనలే కారణమని ఫిష్మాన్ విశ్లేషణ పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో అమెరికాలో ఓపీటీ కింద 2,94,253 మంది అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు పనిచేశారు. వీరిలో భారతీయులు 1,43,740 మంది ఉండగా చైనాకు చెందినవారు 61,981 మంది ఉన్నారు.

More Stories
షేక్ హసీనా పత్రికా సమావేశం తర్వాత మాజీ ఎంపీ ఇంటిపై బాంబు దాడి.
ఇరాన్ యుద్ధంతో అమెరికా క్షిపణి నిరోధకాలు ఖాళీ!
ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి