యాదగిరిగుట్టగా యాదాద్రి పేరు మార్పు

యాదగిరిగుట్టగా యాదాద్రి పేరు మార్పు
చారిత్రక ప్రాశస్తం కలిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని భక్తులు పిలుచుకునే విధంగానే యాదాద్రి బదులుగా యాదగిరిగుట్టగానే పిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని తన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం సిఎం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 

స్వామివారిని దర్శించుకున్న అనంతరం యాదాద్రి ఆలయం అభివృద్ధిపై మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎంపి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎంఎల్‌ఎ బీర్ల అయిలయ్యతో కలిసి అధికారులతో సమీక్షించారు.

శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని యాదాద్రి కాకుండా ఇకపై అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగానే వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులకు సిఎంఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. 

గతంలో మాదిరిగానే యాదగిరిగుట్ట కొండపైన భక్తులు నిద్ర చేసి మొక్కులు తీర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వామి వారి దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని, బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి కావాలని ఆదేశించారు. 

ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయడానికి వీలుగా నిధులు మంజూరు చేస్తామని సిఎం తెలిపారు. యాదగిరిగుట్టలో జరిగిన అభివృద్ధి పనులు, పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేసి వారం రోజుల్లో అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.