శంషాబాద్‌ మండలంలోని ఆలయాలపై వరుసగా దాడులు

శంషాబాద్‌ మండలంలోని ఆలయాలపై వరుసగా దాడులు
హిందూ దేవాలయాలపై వరుస దాడులతో శంషాబాద్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మొన్న ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయం ధ్వంసం మరవక ముందే శంషాబాద్ జూకల్ గ్రమంలో చౌడమ్మ పోచమ్మ దేవాలయంపై ఉన్న బట్టలను తీసి దుండగులు పారేశారు. అమ్మవారి కళ్లను ధ్వంసం చేశారు. 
 
సంఘటన స్థలానికి శంషాబాద్ పోలీసులు చేరుకుని పరిసరాలను పరిశీలిస్తున్నారు. గుడి వద్దకు భారీ ఎత్తున చేరుకుని భక్తులు ఆందోళన చేస్తున్నారు. ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న పోలీసులు సరైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దుండగుల కోసం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని స్థానికులకు పోలీసులు సూచించారు.

కాగా.. శంషాబాద్‌ మండలంలోని ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం కూడా మండల పరిధిలోని జూకల్‌ గ్రామ సమీపంలో ఉన్న సోమయ్య చౌడమ్మ దేవాలయంలో గుర్తు తెలియని పదిమంది దుండగులు చొరబడి అమ్మవారి కళ్లు, దుస్తులను తొలగించేందుకు యత్నించారు. గ్రామస్తులు గమనించి వారిని వెంబడించారు. తొమ్మిది మంది పరార్‌ కాగా, ఒకరు గ్రామస్తులకు చిక్కాడు. అతన్ని చితకబాది ఆలయంలో బంధించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని ఆలయంలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుంటుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రత్యేక బలగాలను రప్పించి నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా గ్రామస్తులు పోలీసు వాహనాలపై దాడులు చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. 

ఘటన స్థలానికి డీసీపీ రాజేష్‌, ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ నరేందర్‌రెడ్డి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి సర్దిచెప్పారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. చివరకు నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఘటన స్థలంలో క్లూస్‌ టీంలు ఆధారాలు సేకరిస్తున్నాయి. 

నాలుగు రోజుల వ్యవధిలో ఎయిర్‌పోర్టు కాలనీలో హనుమాన్‌ దేవాలయంలో నవవిగ్రహాల ధ్వంసం, సిద్ధాంతి కట్టమైసమ్మ ఆలయం ఎదుట ఉన్న త్రిశూలం ధ్వంసం, జూకల్‌లో చౌడమ్మ ఆలయంపై వరుస దాడులు జరగడంతో పోలీసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ రాజేష్‌ తెలిపారు.

సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి గత నెలలో గుర్తుతెలియని కొంతమంది దుండగులు అక్రమంగా ప్రవేశించారు. అనంతరం ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాడిని గమనించిన స్థానికులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానికులను గమనించిన దుండగులు పారిపోగా  ఒకరు మాత్రం వారికి చేతికి చిక్కాడు.

 ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమ్మవారి ఆలయంపై దాడి చేయడాన్ని హిందువులు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆలయం వద్దకు పెద్దఎత్తున చేరుకుని ఆందోళనకు దిగారు.