పాకిస్థాన్ తో చర్చలకు సంబంధించిన కొన్ని మార్గాలు ఎప్పుడూ తెరిచి ఉంచాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. అన్యాయం, ఉగ్రవాదం, దౌర్జన్యాన్ని ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో, సమాజంలోని సానుకూల అంశాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆయన సూచించారు.
కేరళలోని తిరుపునంతపురంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ పాకిస్థాన్‌తో చర్చల కోసం తలుపులు తెరిచే ఉంచాలంటూ ఆర్ఆర్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు. హోసబాలే పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాకుండా, అక్కడి ప్రజలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడారని భగవత్ తెలిపారు.
అయితే, పాకిస్థాన్ లేదా ఇతర దేశాల విషయంలో ఆర్ఎస్ఎస్‌కు స్వతంత్ర విదేశాంగ విధానమేమీ లేదని, పాకిస్థాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. గత నెలలో దత్తాత్రేయ హోసబలే ఓ ఇంటర్వ్యూలో దేశ భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఆయన, అదే సమయంలో సంభాషణకు సంబంధించిన మార్గాలను పూర్తిగా మూసివేయకూడదని సూచించారు.
పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని భారత్ ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్నకు సమాధానంగా, అవసరమైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, పరిస్థితులు అనుకూలించినప్పుడు చర్చలకు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. కాగా, పాకిస్థాన్‌లో కూడా భారత్ విభజన తప్పు జరిగిందని భావించే ప్రజలు చాలామంది ఉన్నారని డా. భగవత్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో కొందరు జర్నలిస్టులు, మేధావులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను ప్రశంసిస్తుంటారని చెప్పారు.
రెండు జాతుల సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వర్గాలు అక్కడ ఉన్నాయని, కలిసి జీవించడం మెరుగైన మార్గమని వారు భావిస్తున్నారని తెలిపారు. “పాకిస్తాన్‌లో భారత విభజన తప్పని నమ్మే ప్రజలు చాలా మంది ఉన్నారు. అక్కడి చాలా మంది జర్నలిస్టులు ఆర్‌ఎస్‌ఎస్‌ను, దాని పనిని ప్రశంసిస్తారు. అక్కడ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా, ద్విజాతి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రజలలో ఒక స్పష్టమైన అంతర్వాహిని ఉంది. కలిసి జీవించడమే మేలని వారు అంటారు,” అని ఆయన పేర్కొన్నారు.
పాకిస్థాన్ సమాజంలో ఇలాంటి అంతర్గత భావజాలం కొనసాగుతోందని, దానిని పూర్తిగా విస్మరించలేమని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో భారత్ పాకిస్థాన్‌ను పూర్తిగా ఓడించే పరిస్థితులు వచ్చినా అక్కడి ప్రజలను భారత్‌లో కలుపుకోవాల్సి రావొచ్చు లేదా వారిని అక్కడే శాంతియుతంగా జీవించనివ్వాల్సి రావొచ్చని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.
“మేం హిట్లర్‌లా కాదు. అది మా స్వభావం కాదు. మా మార్గం కాదు. అందుకే కొన్ని ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంచాలి. అన్యాయం, దౌర్జన్యాన్ని ఓడించాలి. కానీ మంచిని కూడా కాపాడాలి” అని చెప్పారు. భవిష్యత్తులో ఏ పరిస్థితులు వచ్చినా, పాకిస్తాన్ ప్రజలతో సంబంధాలను పూర్తిగా తెంచేయడం సరైన మార్గం కాదని భగవత్ స్పష్టం చేశారు. ఒకవేళ భారత్ పాకిస్థాన్‌ను పూర్తిగా ఓడించే స్థితి వచ్చినా, అక్కడి ప్రజలు శాంతియుతంగా జీవించే అవకాశం ఉండాలని, వాళ్లని మన దేశ స్రవంతిలోకి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు.

More Stories
భారత్ విజయాలను `తక్కువ చేసి’ చూపే రాహుల్ ప్రయత్నం
తిరుగుబాటు ఎంపీ కాకోలీ దస్తీదార్ కుమారుడు మమతపై దావా
ఆధునిక ప్రపంచ సవాళ్లకు భారత్ లో శాశ్వత పరిష్కారాలు