ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, భారతదేశం సాధించిన విజయాలను ‘తక్కువ చేసి చూపడానికి’ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే ప్రయత్నిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం బెంగళూరులో నిర్వహించిన విక్సిత్ భారత్ సంకల్ప్ సమావేశం సందర్భంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి సీతారామన్ మాట్లాడుతూ, గాంధీ విమర్శలు దేశ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారాన్ని సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు . “కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు లోక్‌సభలో మాట్లాడిన ప్రతిసారీ, తాను ప్రధానమంత్రి మోదీని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపుతున్నానని భావిస్తూ, ప్రతీదాన్నీ ఖండించడానికి, భారత ప్రజల విజయాలను తక్కువ చేసి చూపడానికే మాట్లాడతారు,” అని ఆమె మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకుడు భారతదేశంలో రాబోయే సంక్షోభం గురించి తరచుగా అంచనాలు వేస్తుంటారని, కానీ అటువంటి హెచ్చరికలు ఆర్థిక సూచికల ద్వారా రుజువు కావడం లేదని ఆమె స్ఫష్టం చేశారు. “దీనికి విరుద్ధంగా, ప్రతి త్రైమాసికంలో, ప్రతి ఏటా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది,” అని ఆమె గుర్తు చేశారు. ఈ అంచనా కేవలం ప్రభుత్వ వాదన మాత్రమే కాదని, ఇది జీడీపీ గణాంకాలలో ప్రతిబింబిస్తోందని, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందిందని సీతారామన్ నొక్కి చెప్పారు.
భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదని, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కూడా భారతదేశ వృద్ధి పథాన్ని ప్రముఖంగా ప్రస్తావించిందని ఆమె తెలిపారు. కాంగ్రెస్ నాయకుడి పదేపదే విమర్శలు పౌరులలో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించవచ్చని ఆమె ఆరోపించారు.
“అయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడు, ఆయన పార్టీ భారతదేశాన్ని కించపరుస్తూనే ఉన్నారు. భారతదేశం ఇబ్బందుల్లో ఉందని ప్రజలను నమ్మించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభాలు, హోర్ముజ్ జలసంధి చుట్టూ అంతరాయాలు ఉన్నప్పటికీ, భారతదేశం ముందుకు సాగుతూనే ఉంది,” అని ఆమె చెప్పారు.
వాణిజ్యం, ఇంధన సరఫరాలపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, ఈ సవాళ్లు ముడి చమురు, ఎల్పీజీ ధరల హెచ్చుతగ్గులకు మించి ఉన్నాయని సీతారామన్ తెలిపారు. ఈ సవాళ్లు ముడిచమురు, ఎల్పీజీ ధరలనే కాకుండా ప్రపంచ నౌకా రవాణాను కూడా ప్రభావితం చేస్తున్నాయని ఆమె గుర్తు చేశారు. సంఘర్షణ ప్రాంతాల గుండా నౌకలను పంపడానికి షిప్పింగ్ కంపెనీలు వెనుకాడతాయిని చెప్పారు.
“నౌకలపై దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున బీమా ప్రీమియంలు పెరుగుతాయి. నౌక ఖాళీగా ఉన్నా, ముడిచమురును తీసుకువెళ్తున్నా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. దేశానికి సరఫరాలు అందేలా చూసేందుకు చివరికి ఆ ఖర్చులన్నీ చెల్లించాల్సి ఉంటుంది,” అని ఆమె వివరించారు. ఈ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, మోదీ ప్రభుత్వం నిరంతరాయ సరఫరాలు, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించిందని ఆమె తెలిపారు.
ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిస్తూ, ‘వికసిత్ భారత్ సంకల్ప సమావేశం’ అనేది ఒక విస్తృత జాతీయ లక్ష్యంలో భాగమని సీతారామన్ పేర్కొన్నారు. “భారతదేశం 1947లో స్వాతంత్ర్యం కోసం పోరాడింది. అది ఒక గొప్ప ఉద్యమం—స్వాతంత్ర్య ఉద్యమం. మనం ఆర్థిక స్వేచ్ఛ, ఆత్మగౌరవం, స్వయం సమృద్ధి, నిజమైన స్వరాజ్యాన్ని సాధించాలంటే, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) దిశగా కృషి చేయాలి” అని ఆమె పిలుపిచ్చారు.
కాబట్టి, ఈ సంకల్ప సమావేశం ఆ ఉద్యమం పట్ల ఒక నిబద్ధత. మనమందరం ఇందులో పాల్గొనాలని ఆమె కోరారు. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగాయని సీతారామన్ చెప్పారు. బహుముఖ పేదరికం తగ్గడం, పారిశుధ్యంలో మెరుగుదల, తాగునీటి లభ్యత పెంపు, ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు, ఆహార భద్రతా చర్యలను ఆమె ఉదహరించారు.
“25 కోట్ల మంది భారతీయులు బహుముఖ పేదరికం నుండి బయటపడ్డారు. తీవ్ర పేదరికం 2013-14లో 29.17 శాతం ఉండగా, అది సుమారు 11.28 శాతానికి తగ్గింది. గ్రామీణ పారిశుధ్య కార్యక్రమాల కింద 12 కోట్ల గృహ మరుగుదొడ్లు నిర్మించడం తద్వారా దాదాపు వంద శాతం కవరేజీ సాధించాము,” అని ఆమె పేర్కొన్నారు.
జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ ఆధారంగా నిర్మించిన భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల విస్తరణను కూడా ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. భారతదేశంలో ప్రస్తుతం 58 కోట్ల జన్ ధన్ ఖాతాలు, 144 కోట్ల ఆధార్ గుర్తింపులు, 125 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని, అలాగే యుపిఐ డిజిటల్ లావాదేవీలకు ప్రపంచ స్థాయి నమూనాగా ఎదిగిందని ఆమె చెప్పారు.
పన్నుల వాటా పంపిణీ, గ్రాంట్లు, మౌలిక సదుపాయాల పెట్టుబడులకు సంబంధించిన గణాంకాలను ఉదహరిస్తూ, కేంద్రం రాష్ట్రాన్ని విస్మరించిందన్న కర్ణాటక ప్రభుత్వ ఆరోపణలను సీతారామన్ తోసిపుచ్చారు. “కేంద్రం రాష్ట్రానికి దక్కాల్సిన వాటాను ఇవ్వడం లేదని కర్ణాటక ప్రభుత్వం తరచుగా ఆరోపిస్తుంటుంది. వాస్తవాలను పరిశీలిద్దాం. 2014 నుండి 2026 మధ్య కర్ణాటకకు పన్నుల వాటా కింద సుమారు రూ. 4 లక్షల కోట్లు అందాయి. ఇది 2014కు ముందున్న సమాన కాలంలో అందిన రూ. 82,000 కోట్లతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ,” అని రాజ్యసభలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీతారామన్ తెలిపారు.
2014 నుండి 2026 మధ్య కర్ణాటకకు సుమారు రూ. 2.71 లక్షల కోట్ల సహాయక గ్రాంట్లు లభించాయని, అలాగే కేంద్రం 50 ఏళ్ల వడ్డీ లేని రుణ పథకం కింద రూ. 18,000 కోట్లకు పైగా నిధులు అందాయని ఆమె పేర్కొన్నారు. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ లక్ష్యాన్ని సాధించే దిశగా మాట్లాడుతూ, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సమిష్టి కృషి అవసరమని, ఇది కేవలం ప్రభుత్వంపైనే వదిలివేయదగిన విషయం కాదని సీతారామన్ స్పష్టం చేశారు.
“2047 వరకు మనకు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అది వినడానికి సుదూరంగా అనిపించవచ్చు, కానీ అది అంత దూరం కాదు. భారతదేశానికి మరింత ఆవిష్కరణలు అవసరం. కర్ణాటక భారతదేశ ఆవిష్కరణల రాజధాని. ఇది ఏరోస్పేస్ అభివృద్ధి, రక్షణ తయారీ, బయోటెక్నాలజీ రంగాలలో ముందుంది. అందువల్ల, ఈ బాధ్యతను కేవలం ప్రభుత్వానికి మాత్రమే వదిలివేయలేము,” అని ఆమె పేర్కొన్నారు. “2047 నాటికి ‘విక్షత్ భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ భారతదేశానికి సహాయపడేలా మనమందరం నిబద్ధతతో పనిచేయాలి,” అని ఆమె జోడించారు.

More Stories
పాకిస్థాన్ తో చర్చలకు కొన్ని మార్గాలు ఎప్పుడూ తెరిచే ఉండాలి
ఆధునిక ప్రపంచ సవాళ్లకు భారత్ లో శాశ్వత పరిష్కారాలు
టిఎంసి ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అమిత్ షాతో భేటీ