అనంత్‌నాగ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

అనంత్‌నాగ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా అనంతనాగ్‌ లోని లార్నూ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు శనివారంనాడు మట్టుబెట్టాయి. అనంతనాగ్ ఆర్మీ జవాన్ హిలాల్ అహ్మద్ భట్‌ హత్య ఘటనలో ఈ ఇద్దరు ఉగ్రవాదులకు ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. భట్ గత అక్టోబర్ మొదటి వారంలో అపహరణకు గరయ్యాడు. ఆ తర్వాత బుల్లెట్లతో ఛిద్రమైన అతని మృతదేహాన్ని బలగాలు కనుగొన్నాయి.

కాగా, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు ఇండియన్ ఆర్మీ ధ్రువీకరించింది. హల్కాన్ గలిలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో బలగాలు గాలింపు ముమ్మరం చేశాయని, ఇది గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయని తెలిపింది. ఇద్దరు ఉగ్రవాదులను సమర్ధవంతంగా మన బలగాలు మట్టుబెట్టాయని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వివరించింది.

కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని విదేశీయుడిగా, ఒకరిని స్థానికుడిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరికి ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. కాగా, కశ్మీర్‌ లోయలో శుక్రవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన చేసిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు కార్మికులు చనిపోగా.. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీనగర్‌లోని జేవీసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు.అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన గంట తరువాత శ్రీనగర్ సిటీలోనూ అదే తరహా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బలగాల ఉచ్చులో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకున్నట్టు తాజా సమాచారం. శ్రీనగర్‌లో గత 30 నెలల తర్వాత ఎన్‌కౌంటర్ ఘటన చోటుచేసుకోడవం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2022 ఏప్రిల్‌లో బిషంబర్ నగర్ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.