శ్రీనగర్ ఎన్ కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!

శ్రీనగర్ ఎన్ కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!

* అనంత్‌నాగ్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ నగర పరిధిలోని ఖన్యార్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తాయిబా కమాండర్ మరణించాడని కశ్మీర్ జోన్ ఐజీపీ విద్ది కుమార్ బర్డీ తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన లష్కరే తాయిబా కమాండర్‌కు 2023లో జరిగిన ఇన్‌స్పెక్టర్ మస్రూర్ హత్య కేసుతో సంబంధం ఉందని ఐజీపీ బర్డీ చెప్పారు.  శనివారం ఉదయం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు భద్రతా జవాన్లు గాయపడ్డారని వెల్లడించారు.

శ్రీనగర్‌లో గత 30 నెలల తర్వాత ఎన్‌కౌంటర్ ఘటన చోటుచేసుకోడవం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2022 ఏప్రిల్‌లో బిషంబర్ నగర్ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.

‘ఇప్పుడు ఆపరేషన్ పూర్తయింది. భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాది పేరు ఉస్మాన్ అని, ఆయన లష్కరే తాయిబా కమాండర్. ఆయన విదేశీ ఉగ్రవాది. ఇన్‌స్పెక్టర్ మస్రూర్ హత్యతో ఆయనకు సంబంధం ఉంది’ అని ఐజీపీ బర్డీ తెలిపారు. అనంత నాగ్ ఎన్ కౌంటర్ మీద ఆయన స్పందిస్తూ.. ‘మాకు అందిన ఇన్ పుట్స్ మేరకు సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించాం. ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు’ అని తెలిపారు.

మరోవంక, శనివారం ఉదయం అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. నలుగురు సైనికులు గాయపడ్డారు. శుక్రవారం బుద్గామ్‌ జిల్లాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వలసకార్మికులను ఉగ్రవాదులు కాల్చి చంపారు.  దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు ముష్కరుల కోసం కూంబింగ్‌ చేపట్టాయి. అనంత్‌నాగ్‌ జిల్లాలోని ఖాన్యార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో గాలింపు ముమ్మరం చేశాయి.

ఈ క్రమంలో సైనికులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో జవాన్లు ఎదురుదాడి చేశారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం హల్కన్‌ గాలి ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న క్రమంలో మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెప్పారు. ఈ ఘటనలో నలుగురు సైనికులు గాయపడ్డారు.