గ్లోబల్‌ వార్మింగ్‌తో జనజీవనానికి మరింత ముప్పు

గ్లోబల్‌ వార్మింగ్‌తో జనజీవనానికి మరింత ముప్పు
వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువుల (జిహెచ్‌జి) స్థాయి అంతకంతకూ పెరిగిపోతోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా సగటు భూ ఉపరితల కార్బన్‌ డయాక్సైడ్‌ (సిఒ2) స్థాయి 420 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ (పిపిఎం)గానూ, అలాగే మిథేన్‌ 1934 పార్ట్స్‌ పర్‌ బిలియన్‌ (పిపిబి)గానూ, మరో గ్రీన్‌హౌజ్‌ వాయువు నైట్రస్‌ ఆక్సైడ్‌ 336.9 పిపిబిగా నమోదైంది. 
 
రెండు దశాబ్దాల గణాంకాలతో పోల్చితే పది శాతం అధికంగా నమోదై కొత్త రికార్డులు సృష్టించాయి. దీని ప్రభావంతో దీర్ఘకాలంలో వాతావరణం వేడెక్కుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఒ) హెచ్చరించింది. వాతావరణంలో ఉండే గ్రీన్‌హౌస్‌ వాయువులు భూమి వంటి గ్రహాల ఉష్ణోగ్రతలను పెంచుతాయి. సూర్యరశ్మి కారణంగా భూమి వేడెక్కుతుందన్న విషయం తెలిసిందే. 
 
భూమి ఉపరితలం ప్రసరింపజేసే వేడి ఎక్కువగా గ్రీన్‌హౌస్‌ వాయువుల ద్వారానే గ్రహించబడుతుంది. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి రికార్డు సృష్టించాయి. మరో రికార్డు ఏమంటే జిహెచ్‌జిల స్థాయి కూడా పెరగడం. ఈ కారణంగా రాబోయే సంవత్సరాలలో భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని డబ్ల్యూఎంఒ విడుదల చేసిన వార్షిక బులెటిన్‌ తెలిపింది. 
 
మానవుల ఉనికి ఉన్నంత కాలం వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ (సిఒ2) వేగంగా కలిసిపోతుంది. ఇతర సమయాలలో కంటే మానవ సంచారం ఉన్నప్పుడే ఇది అత్యంత వేగంగా కలుస్తుంది. గత 20 సంవత్సరాల కాలంలో సిఒ2 వాతావరణంలో 11.4 శాతం మేర పెరిగింది. చిట్టచివరిసారిగా 30-50 సంవత్సరాల క్రితం ఉష్ణోగ్రత ఇప్పటి కంటే 2-3 డిగ్రీలు వేడిగా, సముద్ర మట్టం 10-20 మీటర్లు ఎక్కువగా ఉన్నప్పుడు భూమిపై సిఒ2 ఈ స్థాయిలో పెరిగింది. 
 
పారిస్‌ ఒప్పందం ప్రకారం గ్లోబల్‌ వార్మింగ్‌ను రెండు డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగానే ఉంచాల్సి ఉంటుందని, ఆ లక్ష్య సాధనలో మనం దారి తప్పుతున్నామని డబ్ల్యూఎంఒ తెలిపింది. ఉష్ణోగ్రత ఏ కొంచెం పెరిగినా అది మన జీవితాలపై, భూగోళంపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. 
 
గత సంవత్సరం భూ ఉపరితలంపై సీఓ2, మిథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువులు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి. వీటిలో సిఒ2 చాలా ముఖ్యమైనది. వాతావరణం వేడెక్కడంలో దీని ప్రభావం 64 శాతం మేర ఉంటుంది. శిలాజ ఇంధనాలను తగలబెట్టడం వల్లనే సీఓ2 పెరుగుతోంది. అయితే వాతావరణంపై ఎల్‌నినో ప్రభావాన్ని కూడా తోసిపుచ్చలేము.
 
శక్తివంతమైన గ్రీన్‌హౌస్‌ వాయువు మిథేన్‌ గత దశాబ్ద కాలంగా వాతావరణంలో ఉండిపోయింది. గ్లోబల్‌ వార్మింగ్‌లో దీని ప్రభావం 16 శాతం ఉంటుంది. నైట్రస్‌ ఆక్సైడ్‌ కూడా శక్తివంతమైన గ్రీన్‌హౌస్‌ వాయువే. అంతేకాదు…ఇది ఓజోన్‌ పొరను కరిగించే రసాయనం కూడా. వాతావరణం వేడెక్కడంలో దీని ప్రభావం 6 శాతం మేర ఉంటుంది. గ్లోబల్‌ వార్మింగ్‌పై మిగిలిన 14 శాతం ప్రభావం ఇతర కాలుష్య కారక వాయువుల కారణంగా కలుగుతోంది.