టైగర్ రిజర్వ్‌లో మూడు రోజుల్లో 10 ఏనుగుల మృతి

టైగర్ రిజర్వ్‌లో మూడు రోజుల్లో 10 ఏనుగుల మృతి

మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో ఇటీవల ఏనుగులు వరుసగా మృత్యువాత పడుతుండడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. తాజాగా, మరో మూడు ఏనుగులు చనిపోయినట్లు అధికారులు శుక్రవారం గుర్తించారు. మూడు రోజుల్లోనే చనిపోయిన ఏనుగుల సంఖ్యలో 10కి చేరింది. అవి విషపూరిత పదార్థాలు తీసుకోవడం వల్లే అస్వస్థతకు గురై మృతి చెందినట్టు అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వీకేఎన్ అంబాదే మాట్లాడుతూ..  ‘ఏనుగుల మరణాల వెనుక ఎటువంటి అనుమానస్పద చర్యలు కనిపించడం లేదు. సమీప ప్రాంతాలకు వెళ్లాను. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ నివేదికలో వాస్తవాలు వెల్లడవుతాయి’ అని తెలిపారు. అటు, ఏనుగుల మరణాల మిస్టరీపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఢిల్లీ నుంచి ప్రత్యేక వన్యప్రాణి సంరక్షణ బృందాలు వచ్చాయని, స్థానిక పరిస్థితులను పరిశీలిస్తున్నాయని అటవీ అధికారులు వెల్లడించారు. అలాగే, జాగిలాలు, రాష్ట్ర స్థాయి అటవీశాఖ బృందాలు దర్యాప్తులో పాల్గొన్నాయని చెప్పారు.  కాగా, దేశంలో మూడు రోజుల వ్యవధిలోపూ పది ఏనుగులు మృతి చెందడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు.

మంగళవారం తొలుత ఏడు ఏనుగులు చనిపోయిన విషయం బయటపడింది. బుధవారం మరో ఏనుగు కళేబరం గుర్తించారు. మొదట చనిపోయి ఏడు ఏనుగులు ఆడవే కాగా, వీటి ఒక్కో దాని వయసు మూడేళ్లు ఉంటుంది. బుధవారం చనిపోయిన మగ ఏనుగు వయసు నాలుగు నుంచి ఐదేళ్ల మధ్య ఉంటుందని తెలిపారు.

ఇక, మొత్తం 13 ఏనుగులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. వీటిలో మూడు చికిత్స తర్వాత కోలుకోవడంతో వాటిని వదిలిపెట్టినట్టు సమాచారం.  ఈ ఘటనపై నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి చెందిన ముగ్గురు సభ్యుల టీం, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌కు చెందిన ఐదుగురు సభ్యుల టీం స్వతంత్ర విచారణ జరుపుతున్నాయి. పది రోజుల్లో నివేదిక సమర్పించనున్నాయి.

మొత్తం ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో 100 మంది అటవీ శాఖ సిబ్బందితో దర్యాప్తు కొనసాగించనున్నారు. గత ఆగస్టులో పులుల మరణాలతో బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ వార్తల్లో నిలిచింది. దేశవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. ఈ విషయంలో అటవీ శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తమయ్యింది. అలాగే, బాంధవ్‌గఢ్, షాడోల్ టైగర్ రిజర్వ్‌లో 2021 నుంచి 2023 మధ్య 43 పులులు చనిపోయాయి.