సీబీఎస్‌ఈ విద్యా విధానంలో భాషా విభాగానికి సంబంధించి కీలక మార్పులు జరగనున్నాయి. సీబీఎస్‌ఈ త్రిభాషా విధానాన్ని అమలు చేయనుంది. దీనిలో భాగంగా ఈ ఏడాది తొమ్మిదవ తరగతి విద్యార్థులకు త్రిభాష తప్పనిసరి చేయనుంది. అంటే, ఇకపై విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలి. అందులో రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందే.
వచ్చే జూలై 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలుకానుంది. సీబీఎస్‌ఈ బోధించే అన్ని విద్యాసంస్తల్లో ఈ విధానం అమలుకానుంది. అయితే, పదో తరగతికి మాత్రం ప్రస్తుతానికి త్రిభాషా విధానాన్ని అమలు చేయడం లేదు. వచ్చే ఏడాది నుంచి పదో తరగతికి త్రిభాషా విధానం అమలవుతుంది. అంటే, ఇప్పుడు తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇకపై వరుసగా త్రిభాషా విధానాన్ని అనుసరించాలి.
ఇందుకోసం ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ సిద్ధంగా ఉంది. విద్యార్థులు మూడు భాషల్ని ఆర్1, ఆర్2, ఆర్3గా చదువుకోవాలి. రెండు భారతీయ భాషలు ఇందులో తప్పనిసరి. అవసరమైతే మూడో భారతీయ భాషను ఎంచుకోవచ్చు. లేదా ఏదైనా ఒక విదేశీ భాషను కూడా నేర్చుకోవచ్చు. అలాగే, నాలుగో భాషగా కూడా విదేశీ భాషను ఎంచుకోవచ్చు. మరోవైపు పదో తరగతిలో మూడో భాషకు బోర్డు ఎగ్జామ్ ఉండదు.
అయితే, మూడో భాషకు సంబంధించిన మార్కులు తుది మార్కుల జాబితాలో ఉంటాయి. ఎందుకంటే ఈ పరీక్షల్ని స్కూల్‌లోనే ఇంటర్నల్‌గా నిర్వహిస్తారు. ఏడాదంతా నిర్వహించిన పరీక్షల్లో మార్కుల ఆధారంగా, తుది జాబితాలో వీటిని ప్రచురిస్తారు. బోర్డ్ ఎగ్జామ్ మాత్రం ఉండదు. అలాగే, పదో తరగతిలో మూడో భాషతో సంబంధం లేకుండా విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. మూడో భాష ఆధారంగా ఏ విద్యార్థినీ పరీక్షకు నిరాకరించకూడదు.
పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్‌ఈ ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈకి సంబంధించి గత ఏప్రిల్‌లోనే 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అయితే, వారిపై ఒత్తిడి పెంచడం ఇష్టం లేక, నెమ్మదిగా మూడో భాషను ప్రవేశపెట్టాలని బోర్డు భావించింది. అందుకే, వచ్చే జూలై నుంచి మాత్రమే మూడో భాష అమలు చేయాలని నిర్ణయించింది.

More Stories
ఐదు రోజులు ముందుగానే నైరుతి
ఢిల్లీలో ఇకపై కేవలం ఎలక్ట్రిక్ ఆటోలే
యూపీలో పెనుగాలుల బీభత్సం, అకాల వర్షాలతో 117 మంది మృతి