ఢిల్లీలో ఇకపై కేవలం ఎలక్ట్రిక్ ఆటోలే

ఢిల్లీలో ఇకపై కేవలం ఎలక్ట్రిక్ ఆటోలే

* పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే పెట్రోల్ లేదు!

దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరంగా మారుతున్న వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్’ (సీఏక్యూఎమ్) రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఎన్‌సీఆర్ పరిధిలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఇకపై కేవలం ఎలక్ట్రిక్ ఆటోలను (ఎల్5 కేటగిరీ ఇ-ఆటోలు) మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది. 

దీనితో పాటు చెలామణిలో ఉన్న వాహనాల కాలుష్య నియంత్రణపై నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.  ఢిల్లీ దాని చుట్టుపక్కల జిల్లాల్లో పాత ఇంధన ఆటోల స్థానంలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశ పెట్టేందుకు కమిషన్ ఒక స్పష్టమైన కాల పరిమితిని ప్రకటించింది. 2027 జనవరి 1వ తేదీ నుంచి మొదటి దశలో భాగంగా, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్సీటీ) నిబంధన అమలులోకి వస్తుంది. 

దీని తర్వాత ఇక్కడ కేవలం ఇ ఆటోలకే రిజిస్ట్రేషన్ మాత్రమే చేస్తారు. రెండో దశ 2028 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ఎన్‌సీఆర్ జిల్లాలు అయిన గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) లలో ఈ నియమం వర్తిస్తుంది. ఇక 2029 జనవరి 1వ తేదీ మూడో దశలో భాగంగా ఎన్‌సీఆర్ పరిధిలోకి వచ్చే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ఆటోల కొత్త రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపి వేసి, 100 శాతం ఎలక్ట్రిక్ ఆటోలనే అనుమతిస్తారు. 

మరోవైపు చెల్లుబాటు అయ్యే ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్’ (పీయూసీసీ) లేకుండా తిరిగే వాహనాల వల్ల జరిగే కాలుష్యాన్ని అడ్డుకోవడానికి కమిషన్ కఠిన నిర్ణయం తీసుకుంది. 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎన్‌సీఆర్ పరిధిలోని ఏ బంకులోనూ పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీ పోయకూడదని ఆదేశించింది. 
 
‘ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్’ (ఏఎన్‌పీఆర్) కెమెరా సిస్టమ్స్ వంటి అత్యాధునిక సాంకేతికత ద్వారా బంకులకు వచ్చే వాహనాల సర్టిఫికేట్లను తనిఖీ చేస్తారు. దీనికోసం తగిన సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ, ఎన్‌సీఆర్ రాష్ట్రాల అధికారులను ఆదేశించారు. అయితే అత్యవసర వైద్య పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ విధులు, విపత్తు నిర్వహణ వాహనాలకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.  ఇదిలా ఉండగా, వారం రోజుల క్రితమే ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత గణనీయంగా మెరుగుపడటంతో కాలుష్య నియంత్రణ మండలి ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (జీఆర్‌ఏపీ) స్టేజ్-I ఆంక్షలను తక్షణమే ఉపసంహరించుకుంది.