చార్‌ధామ్‌కు 114 రోజుల్లోనే 47 ల‌క్ష‌ల మంది భక్తులు

చార్‌ధామ్‌కు 114 రోజుల్లోనే 47 ల‌క్ష‌ల మంది భక్తులు

ఉత్తరాఖండ్‌ లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. వర్షాకాలం  కారణంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఈ యాత్రా సీజన్ ప్రారంభమైన 114 రోజుల్లోనే మొత్తం 47,02,703 మంది భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 4,68,556 అధికం కావడం విశేషం. ఈ ఏడాది యాత్ర సరికొత్త రికార్డును నెలకొల్పే దిశగా సాగుతోంది.

భక్తుల భద్రతే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పష్టంచేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ యాత్ర సజావుగా సాగేలా అన్ని సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే సహాయక చర్యలు చేపట్టేందుకు విపత్తు నిర్వహణ బృందాలు 24 గంటలూ సిద్ధంగా ఉండాలని సూచించారు. 

రాష్ట్ర విపత్తు నియంత్రణ గది నుంచి ఆయన స్వయంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వాతావరణం అనుకూలించనప్పుడు ప్రభుత్వం యాత్రికుల కదలికలను నియంత్రిస్తూ, యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ది. సోమవారం వాతావరణం అనుకూలించకపోయినా 15,376 మంది భక్తులు చార్‌ధామ్‌ను సందర్శించారు. ఈ యాత్రలో భాగంగా బద్రీనాథ్ క్షేత్రానికి అత్యధికంగా 16,12,112 మంది భక్తులు తరలివచ్చారు. 

ఆ తర్వాత కేదార్‌నాథ్‌ను 14,50,116 మంది, గంగోత్రిని 7,37,629 మంది, యమునోత్రిని 6,62,347 మంది దర్శించుకున్నారు. వీరే కాకుండా హేమకుండ్ సాహిబ్‌ను 2,40,499 మంది భక్తులు సందర్శించారు. గత ఏడాదితో పోలిస్తే ఒక్క బద్రీనాథ్‌లోనే 3.5 లక్షల మందికిపైగా అదనపు యాత్రికులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. 

 “చురుగ్గా సాగుతున్న రుతుపవనాల దృష్ట్యా, విపత్తు నిర్వహణ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంది. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు సహాయక,  రక్షణ చర్యలను వెంటనే చేపట్టేలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే యాత్రికులు తమ ప్రయాణాన్ని చేపట్టాలని సూచిస్తున్నాము,” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలను ఏప్రిల్ 19న తెరవడంతో ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయాన్ని తెరిచారు. హిందూమతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను కలిపి ఛోటా చార్‌ధామ్‌గా పిలుస్తారు. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఐక్యతను బలోపేతం చేసేందుకు ఈ యాత్రా సంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.