కావేరీ జలాల్లో కర్ణాటకకు 70 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాలంటూ ఓ ప్రైవేట్ సొసైటీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అంతర్రాష్ట్ర నీటి వివాదాల్లో థర్డ్-పార్టీలు లేదా సొసైటీలు జోక్యం చేసుకోలేవని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇలా సొసైటీల పిటిషన్లను విచారిస్తూ పోతే వివాదాలు ముగియవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
కావేరి జలాలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే చట్టపరంగా పోరాడుతున్నాయన్న కోర్టు రెండు రాష్ట్రాల నదీ జలాల వివాదంలో ప్రైవేట్ సొసైటీలకు స్థానం లేదని తేల్చి చెప్పింది. నదీ జలాల కేటాయింపులపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకే మాట్లాడే హక్కు ఉంటుదని పునరుద్ఘాటించింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కావేరి కేసుల నేపథ్యంలో కొత్త వ్యాజ్యాలకు తావులేదంటూ పిటిషన్ కొట్టేసింది.
ఇదిలా ఉండగా, కావేరీ నీటి విడుదలపై కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు తన వాదనను వినిపించింది. ఆగస్టు 31 నాటికి తమిళనాడుకు నిర్దేశించిన పరిమాణం కంటే ఎక్కువ నీటిని విడుదల చేసినట్లు కర్ణాటక తెలిపింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ, తమిళనాడు వైపు 9,000 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని కొనసాగిస్తున్నామని వెల్లడించింది.
ఆగస్టు 25న సీడబ్ల్యూఎంఏ కీలక నిర్ణయం తీసుకుంది. కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ (సీడబ్ల్యూఆర్సీ) చేసిన సిఫార్సును సమర్థిస్తూ, తమిళనాడుకు 15 రోజుల పాటు 9,000 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని కర్ణాటక నిర్ధారించాలని ఆదేశించింది. బిలిగుండ్లులో ఈ ప్రవాహాన్ని కొనసాగించాలని సూచించింది. ఈ నిర్ణయం సీడబ్ల్యూఎంఏ 56వ సమావేశంలో తీసుకున్నారు.
అయితే కర్ణాటక నుంచి నీటి విడుదల విషయంలో తమకు రావాల్సిన వాటాలో లోటు ఏర్పడిందని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. సీడబ్ల్యూఎంఏ దృష్టికి నీటి బకాయిల అంశాన్ని తీసుకెళ్లినా, ఆ విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు వెలువడలేదని తమిళనాడు తరఫు న్యాయవాదులు గత విచారణలో తెలిపారు. కావేరీ జలాల విడుదలపై తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
వర్షాభావ పరిస్థితుల్లో తమకు రావాల్సిన నీటి వాటా అందడం లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో కర్ణాటక నుంచి తక్షణమే నీటిని విడుదల చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఆగస్టు 25న సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి, తన నీటి విడుదలకు సంబంధించిన ఫిర్యాదును సీడబ్ల్యూఎంఏ ముందు ప్రస్తావించుకోవచ్చని సూచించింది. ఆ తర్వాత సీడబ్ల్యూఎంఏ సమావేశమై 9,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని 15 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించింది.

More Stories
జైష్ ఉగ్రవాది గాలింపు కోసం కాశ్మీర్లోని 5 జిల్లాల్లో హై అలర్ట్
మణిపూర్ సహాయక శిబిరాల్లో మరణాలపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి
హిందీ బోధనపై తమిళనాడు వ్యతిరేకతపై సుప్రీంకోర్టు అసహనం