జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ‌లో 40 ప్ర‌శ్న‌లు.. మొదటిసారి కులగణన

జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ‌లో 40 ప్ర‌శ్న‌లు.. మొదటిసారి కులగణన
సెప్టెంబర్ 1 నుంచి మంచు తీవ్రంగా కురిసే ప్రాంతాల్లో ప్రారంభం కానున్న  2027 జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ‌లో ఇంటింటి సర్వేలో సమాచార సేకరణకు 40 ప్ర‌శ్న‌లు అడ‌గ‌నున్నారని పేర్కొంటూ రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా మృత్యుంజ‌య్ కుమార్ నారాయ‌ణ్ నోటీఫికేష‌న్ జారీ చేశారు. భౌగోళిక‌, సామాజిక‌, విద్యా, ఆర్థిక అంశాల వివ‌రాల‌ను ప్ర‌శ్నావ‌ళిలో అడ‌గ‌నున్నారు. వ్య‌క్తి పేరు, ఇంటి యాజ‌మానితో రిలేష‌న్‌, లింగం, పుట్టిన తేది, వ‌య‌సు, మ్యారేజ్ స్టేట్‌, జీవిత భాగ‌స్వామి పేరు, నేష‌నాలిటీ లాంటి స‌మాచారాన్ని సేక‌రించ‌నున్నారు.

ఇక మ‌త‌ప‌ర‌మైన అంశాల్లో షెడ్యూల్ కుల‌మా లేక షెడ్యూల్ తెగ‌కు చెందిన వారా? అని తెలుసుకోనున్నారు. కులం, త‌ల్లితండ్రులు, వైక‌ల్యం, మాతృభాష‌తో పాటు ఇత‌ర అంశాల‌ను సేక‌రిస్తారు. అక్ష‌రాస్య‌త‌, డిజిటిల్ లిటిర‌సీ స్టేట‌స్ కూడా తెలుసుకుంటారు. కరోనా టీకా తీసుకున్నారా? ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి? డాక్యుమెంట్ల వివ‌రాలు, మొబైల్ నెంబ‌ర్‌, ఆధార్‌, ఓట‌ర్ ఐడీ, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు వివ‌రాలు కూడా సేక‌రించ‌నున్నారు.

ల‌డాక్‌, జ‌మ్మూక‌శ్మీర్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌లో సెప్టెంబ‌ర్ ఒక‌టి నుంచి 30వ తేదీ వ‌ర‌కు జ‌నాభా లెక్క‌ల సమాచారాన్ని సేక‌రించ‌నున్నారు. దేశంలోని మిగితా ప్రాంతాల్లో వ‌చ్చే ఏడాది జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ జ‌ర‌గ‌నున్న‌ది. జ‌నాభా లెక్క‌ల్లో భాగంగా తొలిసారి కులం వివ‌రాల‌ను సేక‌రించ‌నున్నారు. గ‌త ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన క్యాబినెట్ క‌మిటీ భేటీలో కుల వివ‌రాల సేక‌ర‌ణ కూడా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు.

యావ‌త్ జ‌నాభా లెక్క‌ల ప్ర‌క్రియ మొత్తం డిజిట‌ల్ విధానంలో జ‌ర‌గ‌నున్న‌ది. తొలి ద‌శ‌లో భాగంగా ఇప్ప‌టి హౌజ్ లిస్టింగ్‌, హౌసింగ్ సెన్స‌స్ ప్ర‌క్రియ జ‌రుగుతున్న‌ది. సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు ఆ స‌మాచారాన్ని సేక‌రిస్తారు. ఏప్రిల్ 16వ తేదీన ఈ ప్ర‌క్రియ మొద‌లైంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న క‌ట్ట‌డాలు, ఇండ్లు, ఇంటి నిర్మాణాల స‌మాచారాన్ని ఎన్యుమ‌రేట‌ర్లు సేక‌రిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌నాభా లెక్క‌ల నిర్వ‌హ‌ణ కోసం కేంద్రం సుమారు 11 వేల కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయించింది.