ఢిల్లీ స్కూల్ పేలుడుతో ఖ‌లిస్తానీ లింకు!

ఢిల్లీ స్కూల్ పేలుడుతో ఖ‌లిస్తానీ లింకు!

ఢిల్లీలోని రోహిణి ప్ర‌శాంత్ విహార్‌లో ఉన్న సీఆర్పీఎఫ్ స్కూల్ వ‌ద్ద ఆదివారం పేలుడు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ పేలుడుతో లింకు ఉన్న టెలిగ్రాం యాప్ మెసేజ్‌పై పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. అయితే ఆ పేలుడుతో ఖ‌లిస్తానీ లింకు ఉన్న‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో కూడా ఆ కోణంలో పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. 

ఆదివారం స్కూల్ గోడ వ‌ద్ద జ‌రిగిన పేలుడు వ‌ల్ల ఎవ‌రికీ గాయాలు కాలేదు. కానీ పేలుడు ధాటికి స‌మీపంలో ఉన్న సైన్‌బోర్డులు, హోర్డింగ్‌లు, షాపులు, వాహ‌నాల కిటికీ అద్దాలు ప‌గిలిపోయాయి. పేలుడు జ‌రిగిన ప్ర‌దేశంలో తెలుపు రంగు పౌడ‌ర్ ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ విష‌యాన్ని వాళ్లు ఎఫ్ఐఆర్‌లో న‌మోదు చేశారు.
 
విడుదలైన సమాచారం ప్రకారం, సంఘటన స్థలానికి సమీపంలో అనుమానాస్పద పరిస్థితులలో ఒక వ్యక్తి (తెలుపు టీ షర్టు ధరించి) ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. పేలుడుకు ముందు రోజు రాత్రి నిందితుడి కార్యకలాపాలు గమనించినట్లు వారు తెలిపారు.  కేసుకు సంబంధించిన ఇతర వివరాల ప్రకారం, పేలుడు కోసం ఉపయోగించిన పేలుడు పదార్థాన్ని పాలిథిన్ బ్యాగ్‌లో చుట్టి, అర నుండి ఒక అడుగు లోతు గొయ్యిలో అమర్చినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు ధృవీకరించాయి. నాటిన తరువాత, గొయ్యి చెత్తతో కప్పబడి ఉందని వివరించారు. 
 
గుర్తు తెలియ‌ని పేలుడు ప‌దార్థం వ‌ల్ల పేలుడు సంభ‌వించిన‌ట్లు ఆ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. పేలుడు ఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి ముందు రాత్రి సీసీటీవీ ఫూటేజ్‌ను రిక‌వ‌రీ చేసిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఖ‌లిస్తానీ వేర్పాటువాదుల‌ను భార‌త ఏజెంట్లు టార్గెట్ చేస్తున్న నేప‌థ్యంలో ఈ త‌ర‌హా ప్ర‌తీకార దాడికి పాల్ప‌డిన‌ట్లు టెలిగ్రాం యాప్‌లో ఓ పోస్టు వైర‌ల్ అవుతున్న‌ది. 
 
దీంతో ఆ పేలుడు వెనుక ఖ‌లిస్తానీ వేర్పాటువాదుల హ‌స్తం ఉండి ఉంటుంద‌ని భావిస్తున్నారు. అయితే ఆ పోస్టును క్రియేట్ చేసిన గ్రూపున‌కు చెందిన వివ‌రాలు వెల్ల‌డించాల‌ని టెలిగ్రాం సంస్థ‌కు లేఖ రాసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.