జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. గాందర్ బాల్ జిల్లా సోన్ మార్గ్ ప్రాంతంలోని ఒక సొరంగ మార్గం నిర్మాణం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ నిర్మాణ కంపెనీకి చెందిన ఓ డాక్టర్, ఆరుగురు నిర్మాణ కార్మికులు కలిపి ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని జిల్లా అధికార వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల క్రితం సోఫియాన్ జిల్లాలో ఓ బీహారీ కార్మికుడ్ని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఉగ్రదాడి జరిగిన సంగతి తెలుసుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి.
ఈ దాడిని దారుణమైన, పిరికిపంద చర్య అంటూ పేర్కొంటూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరాయుధలైన అమాయక పౌరుల్ని హత్య చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. `సోనామార్గ్ రీజియన్‌లో గగన్‌గిర్ వద్ద నాన్ లోకల్ కార్మికులపై ఉగ్రదాడి పిరికిపందల చర్య. రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కార్మికులు పనిచేస్తున్నారు. గాయపడ్డవాళ్లను శ్రీనగర్‌లోని స్కిమ్స్ దవాఖానకు తరలించాం’ అని ఎక్స్ వేదికగా సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఇక్కడి గగన్‌గిరి వద్ద సొరంగ నిర్మాణ పనులు చేస్తున్న ప్రైవేట్ కంపెనీ కార్మికులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ‘ఎక్స్’ వేదికగా జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాడులకు దిగిన ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైందని అధికారులు తెలిపారు.
More Stories
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు- 8 మంది మృతి
కశ్మీర్లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్