ఉధంపూర్‌లో బ‌స్సు లోయ‌లో ప‌డి 21 మంది మృతి

ఉధంపూర్‌లో బ‌స్సు లోయ‌లో ప‌డి 21 మంది మృతి
జమ్మూ-కశ్మీర్‌లోని ఉధంపూర్‌ లో సోమవారం బస్సు లోయలో పడిన ఘటనలో సుమారు 21 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. రామ్‌నగర్‌ నుండి ఉధంపూర్‌ వెళ్తుండగా మధ్యలో జాలో అనే ప్రాంతంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కొండ మలుపు వద్ద దారి కనిపించకపోవడంతో డ్రైవర్ అదుపు తప్పడంతో  బస్సు  లోయలో పడిందని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఉధంపూర్‌ డీఐజీ శివకుమార్‌ శర్మ పేర్కొన్నారు. 
21 మంది మరణించగా, మరో 29 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కొండ ప్రాంతం గుండా వెళుతున్న సైనిక వాహన శ్రేణి సహాయక చర్యలకు నాయకత్వం వహించింది. ఆ బస్సులో రామ్‌నగర్ నుండి ఉధంపూర్‌కు 50 మంది ప్రయాణికులు ఉన్నారు, వీరిలో చాలామంది తమ రోజువారీ పనులకు వెళ్తున్నవారే.
ఒక బస్సు ఆటో-రిక్షాను నుజ్జునుజ్జు చేసి, ఆపై కింద ఉన్న రహదారిపై తలక్రిందులుగా పడిపోయింది. ఆటో-రిక్షాలో ప్రయాణిస్తున్న వారికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉధంపూర్ బస్సు ప్రమాదం హృదయ విదారకమని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు మరణించిన విషయం తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతు కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.