త్వరలో జనగణన చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. ఎన్‌డిఎ నేతృత్వంలోని మోదీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనగణన ప్రకటించిన తర్వాత కులగణన ప్రక్రియకు సంబంధించిన వివరాలను కచ్చితంగా వెల్లడిస్తాం’ అని అమిత్‌షా చెప్పారు.
60 ఏళ్ల తర్వాత తొలిసారి రాజకీయ సుస్థిరత నెలకొన్నదని చెబుతూ తమకు విధానాలను అమలు పరచడం, వాటి కొనసాగింపునకు సంబంధించిన అనుభవం కూడా ఉందని స్పష్టం చేశారు. మొదటిసారి భారత్ విదేశాంగ విధానంలో మెరుగ్గా ఉందని, అంతర్గతంగానూ, బాహ్యంగానూ భారత్ దృఢమైన యంత్రాంగాన్ని కలిగి ఉందని అమిత్‌షా పేర్కొన్నారు.
3.0 మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు లక్షల కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆమోదించింది. మధ్యతరగతికి ప్రజానీకానికి పన్నులు లాభం చేకూరేలా మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు క్రెడిట్ గ్యారెంటీ పథకం, 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ బీమా సౌకర్యం, మూడు కొత్త క్రిమినల్ చట్టాలు, ఇతర కొన్ని పథకాలను చేపట్టడం జరిగిందని అమిత్‌షా వివరించారు.
పదేళ్ల అభివృద్ధి, భద్రత, సంక్షేమం తర్వాత ప్రజలు మూడవ సారి బీజేపీ మిత్ర కూటమిని మరోసారి ఆశీర్వదించారని ఆయన పేర్కొన్నారు. గడిచిన 60 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఇది దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందని, పాలసీలను సమర్థవంతంగా అమలు చేశామన్నారు. ప్రధాని మోదీ తీసుకువచ్చిన కొత్త విద్యా విధానంలో.. ప్రాచీన, ఆధునిక విద్యా వ్యవస్థలు ఉన్నట్లు తెలిపారు. ఆ విద్యా వ్యవస్థ ప్రాంతీయ భాషలను గౌరవిస్తుందని హోంమంత్రి తెలిపారు.
గత పదేళ్లలో ఇండ్లు, టాయిలెట్లు, గ్యాస్ కనెక్షన్లు, త్రాగునీరు, విద్యుత్తు, ఉచిత ఆహార ధాన్యాలు, ఆరోగ్యం అందించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు దేశంలో ఇండ్లు లేని వారు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయనున్నట్లు అమిత్ షా తెలిపారు.
25 వేల మారుమూల గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం, మహారాష్ట్రలోని వాధవన్‌లో భారీ ఓడరేవు నిర్మాణం వంటివి ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయని వెల్లడించారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంచామని, ఉల్లిపాయలు, బాస్మతీ బియ్యంపై కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) తొలగించామని పేర్కొన్నారు. ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతి సుంకాన్ని పెంచామని చెప్పుకొచ్చారు.
“దేశంలోని అనేక సంస్థలు ప్రధాని మోదీ పుట్టినరోజును ‘సేవా పఖ్వాడా’గా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాయి. సెప్టెంబర్ 17- అక్టోబర్ 2 వరకు బీజేపీ కార్యకర్తలు పలు సేవాకార్యక్రమాలు చేపడతారు. మోదీ నిరుపేద కుటుంబంలో పుట్టి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయ్యారు. అందుకే ఆయనకు ప్రపంచంలో 15 దేశాలు అత్యున్నత గౌరవ పురస్కారాలను ఇచ్చాయి. 140 కోట్ల మంది భారతీయులు ప్రధాని మోదీ దీర్ఘాయుష్షు కోసం ఈ రోజు ప్రార్థిస్తున్నారు” అని అమిత్ షా చెప్పుకొచ్చారు. .
మూడోసారి అధికారంలోకి వస్తామని, చేపట్టబోయే పనులు త్వరగా పూర్తిచేసేందుకు లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల ముందే బ్యూరోక్రసీని ప్రధాని నరేంద్ర మోదీ కోరడంతో తాము అనుకున్న పనులను పూర్తిచేయగలిగామని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని అమిత్‌షా పేర్కొంటూ రైలు ప్రమాదాలపైనా తాము దృష్టిసారించామని, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా రక్షణ పథకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు.
More Stories
సచివాలయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం