ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ

ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్లే అతిశీని కొత్త ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖరారు చేసింది.  డిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీని ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపిక చేసింది.. మంగళవారం ఉదయం కేజ్రీవాల్‌ నివాసంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆతిశీ పేరును ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు. 
 
ఆతిశీ పేరును కేజ్రీవాల్‌ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. షీలా దీక్షిత్‌ తర్వాత దిల్లీలో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ విధులు నిర్వర్తించనున్నారు.  కొత్త సీఎంగా ఎంపికైన ఆతిశీ సింగ్​ తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. తన లాంటి ఫస్ట్​టైమ్​ పొలిటిషియన్​కు ఇలాంటి బాధ్యతలు అప్పగించడం ఆమ్​ ఆద్మీ పార్టీలోనే సాధ్యం అని ఆమె పేర్కొన్నారు.

“ముఖ్యమంత్రిగా నాతో పాటు ఢిల్లీ ప్రజలు, ఆప్​ ఎమ్మెల్యేలు ఒకే లక్ష్యంతో ఎన్నికల వరకు పనిచేస్తాం. మేము ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్​ను మళ్లీ గెలిపించాలి. కేజ్రీవాల్​ నన్ను నమ్మారు. ఎమ్మెల్యే, మంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిని చేశారు. నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని ఆమె తెలిపారు. 

“ఫస్ట్​టైమ్​ పొలిటిషియన్స్​ కేవలం ఆప్​లో మాత్రమే ఇలాంటి అవకాశాలను పొందగలరు. నేను వేరే పార్టీలో ఉంటే ఇలా జరిగేది కాదు. నేను సంతోషంగా ఉన్నాను. మరోవైపు మా అన్నయ్య(కేజ్రీవాల్) రాజీనామా చేస్తుండటం వల్ల బాధగా ఉంది. ఇది, కేజ్రీవాల్ రాజీనామా చేసే బాధాకరమైన క్షణం కాబట్టి నాకు పూలమాలలు, అభినందనలు తెలపవద్దని విజ్ఞప్తి చేస్తున్నా” అని సూచించారు. 

“నేను ఈ బాధ్యత తీసుకున్నంత కాలం నా లక్ష్యం ఒక్కటే. దిల్లీ ప్రజలను రక్షించడానికి అరవింద్​ కేజ్రీవాల్​ మార్గదర్శకత్వంలో ప్రభుత్వాని నడపడానికి ప్రయత్నిస్తాను.” అని ఆతిశీ చెప్పారు.  సెప్టెంబరు 26-27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఆ సమయంలోనే ఆతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఉపముఖ్యమంత్రిగా ఎవరినీ ప్రకటించే అవకాశాలు లేవని తెలుస్తోంది.

కేజ్రీవాల్‌ అరెస్టై జైల్లో ఉన్న సమయంలో అతిశీ అన్నీ తానై పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ బాధ్యతలను చక్కదిద్దారు. అతిషి పూర్తి పేరు.. అతిషి మార్లెనా సింగ్. 1981, జూన్ 8వ తేదీన న్యూఢిల్లీలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, తృప్త వాహీ. వీరిద్దరు యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ పూసా రోడ్డులోని స్ర్పింగ్‌డేల్ హైస్కూల్‌లో అతిషి చదువుకున్నారు. 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో ఆమె బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. 

అనంతరం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరి.. చెవెనింగ్ స్కాలర్‌‌షిప్ అందుకున్నారు. 2003లో చరిత్రలో ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత 2005లో రోడ్స్ స్కాలర్‌తో ఆక్స్‌ఫర్డ్‌లోని మాగ్డలెన్ కాలేజీకి అతిషి హాజరయ్యారు.  2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంతో అతిషి రాజకీయ జీవితం ప్రారంభమైంది. పార్టీ విధి విధానాలు, రూపకల్పనలో ఆమె క్రియశీలకంగా వ్యవహరించారు. 2015లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో జరిగిన చారిత్రాత్మక జల సత్యాగ్రహంలో అతిషి పాల్గొన్నారు. ఈ దీక్షతో సంబంధమున్న ఆప్ నాయకుడు, కార్యకర్త అలోక్ అగర్వాల్‌కు ఆమె సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
 
ఇక 2019 ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ గంబీర్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అతిషి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో దాదాపు 4.5 లక్షల ఓట్ల తేడాతో ఆమె ఓటమిపాలయ్యారు.  అనంతరం 2020లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్‌కాజీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా ఆమె రంగంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి ధర్మంబిర్ సింగ్‌పై అతిషి ఘన విజయం సాధించారు.  కేజ్రీవాల్ కేబినెట్‌లో అత్యంత కీలకమైన 11 శాఖలు అతిషినే పర్యవేక్షిస్తున్నారు.
 
 విద్యా శాఖ మంత్రిగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. అలాగే ఢిల్లీలో మంచి నీటి ఇబ్బందులు ఏర్పడినప్పడు నీటి శాఖ మంత్రిగా అతిషి… నీటి విడుదల కోసం కేంద్రంలోని బీజేపీతోనే కాదు.. పక్కనున్న హరియాణాలోని బీజేపీ ప్రభుత్వంతో పెద్ద యుద్దమే చేశారు.