రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర

రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ రూ.30.1 లక్షలకు బిజెపి నేత కొలను శంకర్‌ రెడ్డి బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు. 1116 రూపాయలతో ప్రారంభమైన వేలం పాట క్రమంగా పెరుగుతూ లడ్డూ కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనే నమ్మకం ఉండడంతో, రూ.30 లక్షల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత ఎవరూ వేలం పాట పాడేందుకు ముందుకు రాకపోవడంతో కొలను శంకర్‌ రెడ్డికే బాలాపూర్‌ లడ్డూ దక్కింది.

రాష్ట్రంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించే లడ్డూ వేలం అంటే ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్‌ గణేషుడే. ఏటా బాలాపూర్‌లో గణేషుడికి భారీ లడ్డూ నైవేద్యంగా పెడుతుంటారు. భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఘన చరిత్ర ఉంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే, వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బాలాపూర్‌లో తొలిసారిగా 1980లో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది.

ఉత్సవ నిర్వాహకులు 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. తొలి వేలం పాటలో రూ.450కి స్థానికుడు కొలను మోహన్​రెడ్డి గెలుపొందారు. పొందిన లడ్డూను కుటుంబసభ్యులకు ఇవ్వడంతోపాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. ఆ కుటుంబానికి, కొలను మోహన్​రెడ్డికి ఆ ఏడాది అన్ని పనుల్లోనూ మంచి జరిగింది. లడ్డూ పొందడం ద్వారానే బాగా కలిసొచ్చిందని భావించిన మోహన్‌రెడ్డి, మరుసటి ఏడాది 1995లో మళ్లీ వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు.

అప్పుడు వేలం ధర రూ.4,500. నేటితో ఆ ధరను పోలిస్తే రూ.లక్షకు పైగా ఉంటుంది. ఇలా 1994లో రూ. 450తో మొదలైన లడ్డూ వేలంపాట, వందలు, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షలు పలుకుతోంది. 2001వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. 2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి రూ.1,05,000కు లడ్డూ దక్కించుకున్నారు.

ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది. 2007లో స్థానికుడు రఘునందనచారి రూ. 4,15,000కు పాటపాడి లడ్డూను దక్కించుకున్నారు. 2015లో బాలాపూర్ లడ్డూ రూ.10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కల్లెం మదన్ మోహన్‌రెడ్డి రూ.10,32,000 లకు లడ్డూను దక్కించుకున్నారు. కాగా ఇప్పటివరకు జరిగిన బాలాపూర్‌ వేలంలో అత్యధికంగా ఎనిమిది సార్లు కొలను వంశస్తులే దక్కించుకోవటం గమనార్హం.

గతేడాది 2023లో రూ.27 లక్షలకు లడ్డూ వేలం ధర పలకగా, ఈసారి అంచనాలకు తగ్గట్టు రూ.3.01 లక్షలకు కొలను కుంటుంబం మళ్లీ లడ్డూను దక్కించుకుంది. దీంతో తొమ్మిది సార్లు కొలను కుటుంబానికి ఆ మహా ప్రసాదం వరించింది.  గతేడాది స్థానికేతరుడైన దాసరి దయానంద్‌ రెడ్డి ఈ భారీ లడ్డూను దక్కించుకున్నారు. ఇక ఈ ఏడాది ఏకంగా రూ.30 లక్షలు ధర పలకడం విశేషం.

ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకున్నది. ఈ నేపథ్యలో లడ్డూకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా నిర్వాహకులు వేలంలో కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా డబ్బును డిపాజిట్‌ చేయాలని నిబంధనను తెచ్చారు. 

ఈ సారి అయోధ్య రామమందిరం నమూనాలో ఏర్పాటు చేసిన మండపంలో బాలాపూర్‌ గణపతి కొలువుదీరి పూజలందుకున్నారు. మంగళవారం చివరి పూజ అనంతరం బాలాపూర్‌ బొడ్రాయి దగ్గర వేలంపాటను బాలాపూర్ గణేశ్‌ ఉత్సవ సమితి నిర్వహించింది. లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు.

కాగా, బాలాపూర్‌ లడ్డూనే వేలం పాటలో దక్కించుకున్న బీజేపీ నేత కొలను శంకర్ రెడ ఈ లడ్డూను కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు అందజేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.