న్యూయార్క్‌లోని స్వామినారాయణ దేవాలయం ధ్వంసం

న్యూయార్క్‌లోని స్వామినారాయణ దేవాలయం ధ్వంసం
న్యూయార్క్‌లోని మెల్‌విల్లేలోని బిఎపిఎస్ స్వామినారాయణ దేవాలయాన్ని స్థానిక కాలమానప్రకారం సోమవారం ధ్వంసం చేయడాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఖండించారు. “అతి దారుణానికి పాల్పడిన వారిపై సత్వర చర్య తీసుకోవలసిందిగా అమెరికా అధికారులతో ఈ విషయాన్ని లేవనెత్తినట్లు” ఎక్స్ పోస్ట్ లో తెలిపారు.
 
కాన్సులేట్ ఇలా పేర్కొంది: “న్యూయార్క్‌లోని మెల్‌విల్లేలో ఉన్న బిఎపిఎస్ స్వామినారాయణ దేవాలయాన్ని విధ్వంసం చేయడం ఆమోదయోగ్యం కాదు. కాన్సులేట్ @IndiainNewYork సంఘంతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా తక్షణ చర్య కోసం అమెరికా చట్టం అమలు అధికారులతో ఈ విషయాన్ని లేవనెత్తింది”. 
 
బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ ఈ సంఘటన పట్ల “తీవ్ర విచారం” వ్యక్తం చేసింది. ఉత్తర అమెరికాలోని వివిధ హిందూ దేవాలయాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. “నిన్న రాత్రి, న్యూయార్క్‌లోని మెల్‌విల్లేలో ఉన్న బిఎపిఎస్  శ్రీ స్వామినారాయణ మందిర్ ద్వేషపూరిత సందేశాలతో అపవిత్రం చేయబడింది. దురదృష్టవశాత్తు, ఇది ఏకైకసంఘటన కాదు” అని పేర్కొంది.
 
“మేము ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. అన్ని వర్గాల మధ్య శాంతి కోసం ప్రార్థిస్తున్నము. నేపథ్యం లేదా విశ్వాసంతో సంబంధం లేకుండా అందరికీ శాంతి, గౌరవం, సామరస్యం అమెరికాలో మత స్వేచ్ఛకు పునాది. ఈ నేరానికి పాల్పడిన వారి కోసం కూడా మేము మా లోతైన ప్రార్థనలు చేస్తున్నాము. వారు ద్వేషం నుండి విముక్తి పొందడం, మన ఉమ్మడి మానవత్వాన్ని చూడటం జరగాలని కోరుకొంటున్నాము” అని తెలిపింది. 
 
ఈ ‘ద్వేషపూరిత నేరం’ గురించి సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు  పేర్కొంది. బిఎపిఎస్  కమ్యూనిటీ సభ్యులు శాంతి, ఐక్యత కోసం ప్రార్థనలు చేయడానికి అపవిత్రం జరిగిన ప్రదేశంలో సమావేశమయ్యారు. లాంగ్ ఐలాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక, రాష్ట్ర, సమాఖ్య నాయకులు వారికి మద్దతు ఇచ్చారు.  బిఎపిఎస్ ఆధ్యాత్మిక నాయకుడు మహంత్ స్వామి మహరాజ్ ఈ సందర్భంగా శాంతి, సామరస్యం కోసం ప్రార్థనలు చేశారు.
 
మరోవైపు న్యూయార్క్‌లోని బిఎపిఎస్  హిందూ దేవాలయంపై జరిగిన దాడిపై దర్యాప్తు జరిపించాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ అమెరికా న్యాయ శాఖను కోరింది. “ఈ వారాంతంలో సమీపంలోని నస్సౌ కౌంటీలో భారీ భారతీయ కమ్యూనిటీ సమావేశానికి ప్లాన్ చేస్తున్నందున హిందూ సంస్థలకు ఇటీవల బెదిరింపులు వచ్చిన తర్వాత, న్యూయార్క్ లోని మెల్విల్లేలోని హిందూ దేవాలయంలో జరిగిన ఈ నీఘటన ఆందోళనకు గురిచేసింది” అని అది పేర్కొంది.
 
ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఇటీవల హిందూ, భారతీయ సంస్థలను బెదిరించే వీడియోను పంచుకున్నారని కూడా పేర్కొంది. న్యూయార్క్‌లో జరిగిన విధ్వంసం ఘటన కాలిఫోర్నియా, కెనడాలలో జరిగిన దేవాలయాలపై జరిగిన దాడులకు సమానమని స్పష్టం చేసింది.
 
శాంతి,  ఐక్యత కోసం జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న అమెరికా ప్రతినిధి టామ్ సుయోజీ, ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న “విధ్వంసక చర్యల” పట్ల తాను “ఆశ్చర్యపోయాను” అని పేర్కొన్నారు. “జాతీయ నాయకులు, తీవ్రవాదం, జవాబుదారీతనం లేకపోవడం వల్ల విధ్వంసం, మతోన్మాదం, ద్వేషపూరిత చర్యలు చాలా తరచుగా జరుగుతున్నాయి. ఇలాంటి చర్యలు అమెరికాకు చెందనివి.  మన దేశం యొక్క ప్రధాన విలువలకు విరుద్ధంగా ఉన్నాయి” అని ఆయన స్పష్టం చేశారు.
 
అంతకుముందు, కెనడాలోని ఎడ్మోంటన్‌లోని బిఎపిఎస్  స్వామినారాయణ దేవాలయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారత సంతతికి చెందిన కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్యను బెదిరిస్తూ భారతదేశ వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసమైంది. ముఖ్యంగా, కెనడాలోని హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరిగాయి. గతంలో ఖలిస్తానీ అనుకూల గ్రూపులు అందుకు కారణంగా ఆరోపణలు చెలరేగాయి. 
 
ఇటువంటి చర్యలు  భారత్, కెనడాల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది. దేవాలయాలపై ఇటువంటి దాడులు పునరావృతమవుతున్నాయని, ఈ సంఘటనలు పసిగట్టడం కష్టంకాని ఉద్దేశ్యంతో జరిగాయని భారత్ పేర్కొంది.
 
“ఇటీవలి కాలంలో కెనడాలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం. నేరస్తులపై చర్యలు తీసుకోకపోవడం అటువంటి నేరస్థులకు మరింత ధైర్యాన్నిచ్చింది. తీవ్రవాదం, హింసకు మద్దతు తెలిపే వారిని, అందుకు బాధ్యులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలి. లేనిపక్షంలో  చట్టబద్ధమైన పాలన, కెనడాలో బహుళత్వం పట్ల గౌరవం తీవ్రంగా దెబ్బతింటుంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.