తాను గణపతి పూజ చేయడంపై కూడా కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నివాసంలో గణేష్ చతుర్థి సందర్భంగా నిర్వహించిన పూజలో మోదీ పాల్గొనడంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. తాజాగా కాంగ్రెస్ విమర్శలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ఒడిశాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతిపక్షాలు సమాజాన్ని ముక్కలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయని, తాను గణేశుని పూజించడం వల్ల ఇబ్బంది పడతున్నారని ఎద్దేవా చేశారు.
“గణేష్ చతుర్థి మన దేశానికి కేవలం విశ్వాస పండుగ మాత్రమే కాదు. ఇది మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. బ్రిటీష్ వారు తమ అధికార దాహంతో దేశాన్ని విభజించి, కులం ప్రాతిపదికన విభజనలు సృష్టించి, సమాజాన్ని విషపూరితం చేస్తూ, “విభజించు, పాలించు” అనే విధానాన్ని తమ ఆయుధంగా ఉపయోగిస్తున్నప్పుడు, లోకమాన్య తిలక్ గణేష్ చతుర్థి బహిరంగ వేడుకల ద్వారా భారతదేశ ఆత్మను మేల్కొల్పారు” అని ప్రధాని గుర్తు చేశారు.
బ్రిటిష్ వారి కాలంలో గణేష్ చతుర్థి వారికి ముల్లులా మారింది. నేడు, అధికారం కోసం ఆకలితో ఉన్నవారు.. సమాజాన్ని విభజించి ముక్కలు చేయడంలో నిమగ్నమై ఉన్నవారు.. అందుకే గణేష్ ఆరాధనతో ఇబ్బంది పడుతున్నారని ప్రధాని ధ్వజమెత్తారు. “నేను గణేష్ ఆరాధనలో పాల్గొన్నందుకు కాంగ్రెస్, మిత్రపక్షాలు అంగీకరించలేకపోతున్నారు” అని ప్రధాని విస్మయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో గణేష్ విగ్రహాన్ని కటకటాల వెనక్కి నెట్టారని ప్రధాని ఆరోపించారు. సమాజంలో విషాన్ని వ్యాపింపజేసే ఇలాంటి మనస్తత్వం దేశానికి ప్రమాదకరమని మోదీ హెచ్చరించారు. “అలాంటి ద్వేషపూరిత శక్తులను ముందుకు సాగనివ్వకూడదు. మనం ఇంకా ఎన్నో మైలురాళ్లను సాధించాలి” అని ప్రధాని పేర్కొన్నారు.
ఒడిశాలో పర్యటిస్తున్న ప్రధాని తన 75 వ పుట్టిన రోజు సందర్భంగా మహిళలకు ఆర్థిక ప్రయోజనం కలిగించే సుభద్ర యోజన పథకాన్ని ప్రారంభించారు. ఒడిశా ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పథకం వల్ల అర్హులైన మహిళలకు ఏటా రూ. 10 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు కోటి మంది లబ్ధిదారులైన మహిళల రెండు విడతల్లో రూ.5 వేలు వంతున మొత్తం రూ. 10 వేలు జమ అవుతుంది.
2024-25 నుంచి 2028-29 వరకు ఐదేళ్ల పాటు ఈ ఆర్థికసాయం అందుతుంది. ఇప్పటికే 60 లక్షల మంది మహిళలు ఈ పథకంలో లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. ఈ నెల 15 వ తేదీలోపు నమోదు చేసుకున్న వారి ఖాతాల్లో మంగళవారం తొలి విడత నగదు జమ చేశారు. ఈ పథకం కోసం ఒడిశా ప్రభుత్వం సుమారు రూ. 55, 825 కోట్లు కేటాయించింది. అయితే, ఒడిశా లోని ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఏడాదికి రూ. 18 వేలు పొందే మహిళలు ఈ సుభద్రయోజనకు అర్హులు కారని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది.
More Stories
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్