కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. పీర్ పంజల్ పర్వత శ్రేణికి అటు, ఇటు ఉన్న ఏడు జిల్లాల్లో పదేళ్ల తర్వాత తొలిసారిగా పోలింగ్ జరగనుంది. బుధవారం పోలింగ్ జరగనున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు.
ఈ 24 అసెంబ్లీ స్థానాల్లో 8 జమ్ము ప్రాంతంలోను, 16 కశ్మీర్ లోయలోనూ ఉన్నాయి. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. తొలిదశ పోలింగ్ జరగనున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 3,276 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.తొలి దశ ఎన్నికల్లో జమ్మూ, ఉదంపూర్, ఢిల్లీలో ఏర్పాటు చేసిన 24 ప్రత్యేక పోలింగ్ స్టేషన్లలో 35,500 మంది విదేశీ కశ్మీరీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభమైందని, ఈరోజు ఓటింగ్ జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ప్రజలు ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను పటిష్టం చేయాలని కోరారు. ప్రధానంగా యువకులు, మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ”జమ్మూ, కాశ్మీర్ ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడానికి, నిజమైన అభివృద్ధి, పూర్తి రాష్ట్ర హోదాతో కొత్త శకాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నారు. 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని, అధిక సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని కోరారు.
14000 మంది పోలింగ్ సిబ్బందిని మోహరించారు. అర్బన్‌లో 302, గ్రామీణ ప్రాంతాల్లో 2974 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థుల్లో సిపిఎంకు చెందిన మహ్మద్ యూసుఫ్ తరిగామి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన సకీనా ఇటూ, పిడిపికి చెందిన సర్తాజ్ మద్నీ, అబ్దుల్ రెహ్మాన్ ఉన్నారు.
ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న వేళ జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ), పీపుల్స్ కాన్ఫరెన్స్(పీసీ), జమ్ముకశ్మీర్ పీపుల్స్ మూమెంట్(జేకేపీఎమ్), ఆప్నీ పార్టీతో పాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎన్నికల బరిలో దిగాయి. కాంగ్రెస్, ఎన్సీ కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా ఎన్సీ 51 సీట్లలో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
మరోవైపు, పీడీపీ 40 మందికి పైగా అభ్యర్థులను బరిలోకి దింపింది. ఎన్సితో హోరాహోరీ పోరు నెలకొన్న కశ్మీర్లో వ్యాలీలో జెండా పాతడమే లక్ష్యంగా పోటీలోకి దిగింది. ఇక బీజేపీ 59 సీట్లలో పోటీ చేస్తోంది. 2014లో బీజేపీ, వ్యాలీలో 30 సీట్లకు పైగా పోటీ చేసింది. అక్కడ బరిలోకి దిగిన 33 సీట్లలో 25 గెలుచుకోగలగింది.
ఈ పార్టీలతో పాటు సజ్జద్ లోన్ నేతృత్వంలో పీపుల్స్ కాన్ఫరెన్స్ తమ అదృష్టం పరిక్షించుకుంటోంది. మాజీ కాంగ్రెస్ నేత, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ), అల్తాఫ్ బుఖారీ నేతృత్వంలో ఆప్నీ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.
More Stories
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్