కంగనా విచారణకు హాజరు కావాలని చండీగఢ్ కోర్టు నోటీసు

కంగనా విచారణకు హాజరు కావాలని చండీగఢ్ కోర్టు నోటీసు

బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ విచారణకు జిల్లా కోర్టుకు హాజరుకావాలని చండీగఢ్‌ కోర్టు ఆదేశించింది. కంగనా కొత్త సినిమా ఎమర్జెన్సీపై దాఖలైన పిటిషన్‌ను మంగళవారం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా నోటీసులు జారీ చేసింది. డిసెంబర్‌ 5న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. 

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ కంగనాకు వ్యతిరేకంగా జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చండీగఢ్‌ ఎస్‌ఎస్‌పీని పిటిషన్‌ కోరారు. కంగనాపై జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అడ్వకేట్ రవీందర్ సింగ్ బస్సీ పిటిషన్ దాఖలు చేశారు.

 కంగనా రనౌత్ కొత్త చిత్రం ఎమర్జెన్సీ సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా నిషేధాన్ని ఎదుర్కొంటున్నది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్నది. ఇప్పటికే ట్రైలర్‌ సైతం విడుదలైంది. మూవీ ద్వారా కంగనా సిక్కుల ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిందని అడ్వకేట్‌ రవీందర్‌ సింగ్‌ బస్సీ ఆరోపించారు.

కంగనా చరిత్ర చదవకుండానే సిక్కులను నెగెటివ్‌గా చూపించిందని ఆరోపించారు. ఈ క్రమంలో మండి ఎంపీపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే, పిటిషన్‌లో కంగనాతో పాటు స్క్రీన్‌ ప్లే రైటర్‌ రితేష్‌ షా, జీ స్టూడియోలను సైతం ప్రతివాదులుగా చేర్చారు. 

ఇదిలా ఉండగా ఎమర్జెన్సీ సినిమా విడుదలపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేస్తూ మొహాలీకి చెందిన గురీందర్‌ సింగ్‌, గుర్మోహన్‌ సింగ్‌ పంజాబ్‌, హర్యానా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చిత్రంలో సిక్కులను తప్పుగా చిత్రీకరించారని ఆరోపించారు. 

సినిమా అలాగే విడుదలైతే సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయని, ఉద్దేశపూర్వకంగా సిక్కుల ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యంతో సినిమా తీశారని ఆరోపించారు. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి.. అందులో ఎస్‌జీపీసీ సభ్యులకు చోటు కల్పించాలని కోరారు. విడుదలకు ముందే వారికి చిత్రాన్ని చూపించి, వివాదాస్పద సన్నివేశాలను తొలగించి, ఆ తర్వాత విడుదల చేయాలని పిటిషన్‌లో కోరారు.