ఎంపీ పదవికి టీఎంసీ నేత రాజీనామా

ఎంపీ పదవికి టీఎంసీ నేత రాజీనామా
పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ ఆ పదవికి రాజీనామా చేశారు. కోల్‌కతా ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆదివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. 
పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ మేరకు లేఖ రాశారు.
చాలా నెలలుగా ఆమెతో స్వయంగా మాట్లాడలేకపోయినందుకు నిరాశ చెందినట్లు తెలిపారు. అవినీతి అధికారులు (లేదా వైద్యులు) టాప్ పోస్టింగ్‌లు పొందడం వంటి కొన్ని విషయాలను తాను అంగీకరించలేనని స్పష్టం చేశారు.
‘‘ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన భయంకరమైన సంఘటన జరిగినప్పటి నుంచి నెల రోజులు ఓపికగా బాధపడ్డాను. మమతా బెనర్జీ పాత తరహాలో ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లతో మీ ప్రత్యక్ష జోక్యం కోసం ఆశపడ్డాను. అది జరగలేదు.  ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకున్నా చాలా తక్కువ, పైగా,  చాలా ఆలస్యమైంది,” అని లేఖలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
 “ఈ అవమానకరమైన సంఘటన జరిగిన తర్వాత అవినీతి చెందిన వైద్యుల కాకస్‌ను పగులగొట్టి, సరికాని పరిపాలనా చర్యలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించినట్లయితే, ఈ రాష్ట్రంలో చాలా ముందుగానే సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడి ఉండవచ్చు”అని ఆయన చెప్పుకొచ్చారు.

కాగా, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీఎంసీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని ప్రజల ఆగ్రహం ప్రతిబింబిస్తోందని జవహర్ సిర్కార్ విమర్శించారు. ప్రభుత్వంపై ఇలాంటి పూర్తి అవిశ్వాసాన్ని తాను ఇప్పటి వరకు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  నిరసనలు ప్రధానంగా రాజకీయ ఉద్దేశ్యాలతో కాకుండా న్యాయం, నిందితులను శిక్షించాలని జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.  సంఘర్షణ లేని విధానాన్ని అనుసరించాలని ఆయన పార్టీని కోరారు. 

పార్టీలో ఆప్తుల, అవినీతిపరులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, ఒక వర్గం నాయకుల పటిష్టమైన వ్యూహాల గురించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తుండటంతో తనకున్న భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎన్నికైన పలువురు పంచాయితీ, మునిసిపల్‌ నేతలు అవినీతితో పెద్ద ఎత్తున ఆస్తులను సంపాదించడం చూసి ఆశ్చర్యపోయానని, ఇవి తనకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా బాధ కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు.

మరోవైపు పార్టీ పంథాను సరిదిద్దుకోకుంటే ‘మతోన్మాద శక్తులు రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటాయని జవహర్ సిర్కార్ హెచ్చరించారు. ‘మూడేళ్లుగా బెంగాల్ సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తడానికి మీరు ఇచ్చిన అవకాశానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కానీ ఎంపీగా కొనసాగడం నాకు ఇష్టం లేదు. కేంద్రం, రాష్ట్రాల్లో అవినీతి, మతతత్వం, నిరంకుశత్వంపై పోరాడటమే నా నిబద్ధత. ఇందులో చర్చలకు తావులేదు’ అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.