భారీ వర్షాలతో ఉత్తరాంధ్రకు రెడ్ అలెర్ట్

భారీ వర్షాలతో ఉత్తరాంధ్రకు రెడ్ అలెర్ట్
బంగాళాఖాతంలో ఒడిశా- బంగాల్ తీరాన్ని ఆనుకుని ఏర్పడిన వాయుగుండం క్రమంగా వాయువ్య దిశగా కదులుతోంది. వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండురోజుల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నట్లు తెలిపింది.  శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాంలకు భారీ వర్షం సూచన ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

విజయనగరం, విశాఖ, తూగో, పగో జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా 70 కి.మీ బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కళింగ, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు ఇచ్చారు. 

భారీ వర్షాలు కారణంగా ఇతర జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించే అవకాశం ఉంది. విశాఖ, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలకు విశాఖలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోపాలపట్నంలోని రామకృష్ణానగర్ కాళీమాత గుడి దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. 

కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లకు ప్రమాదం పొంచివుంది. ఇళ్లలోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపారు. మిగతా ఇళ్లకు కూడా ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. 

సొంత వాహనదారులు, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఘాట్ రోడ్డు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. కొండచరియలు, చెట్లు విరిగి పడే అవకాశం ఉన్నందున ప్రయాణాలు విరమించుకోవాలని కోరుతున్నారు.

విశాఖలో కలెక్టరేట్, పోలీసు కంట్రోల్ రూంలలో ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు. కలెక్టరేట్​లోని కంట్రోల్ రూం నెంబర్లు – 0891 2590102, 0891 2590100. అదే విధంగా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ – 08912565454. వీటితో పాటు 100, 112కి కూడా సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.

విశాఖలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికికి జ్ఞానాపురం బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. అల్లూరి జిల్లాలో గూడెం కొత్త వీధి మండలంలో చేమగడ్డ ప్రధాన రహదారి వంతెన కూలిపోయింది. దీంతో సుమారు 30 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విజయనగరం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.