అక్షరాలు దేనికోసం నేర్చుకోవాలి?

అక్షరాలు దేనికోసం నేర్చుకోవాలి?
ఆకారపు కేశవరాజు                                                                                                                         * నేడు అక్షరాస్యత దినోత్సవం – అవలోకనం
కంప్యూటర్ కొనుక్కున్న మాత్రాన కంప్యూటర్ ఇంజనీరు కాడు – అక్షరాలు నేర్చుకున్న ప్రతివాడు విద్యావంతుడు కాడు మనకు కావలసింది ‘విద్య’: అక్షరాలు నేర్చుకున్నంత మాత్రానే విద్యావంతుడిగా పరిగణిస్తూ లెక్కిస్తున్న నేటి కొలమానం సరైనది కాదు. అక్షర జ్ఞానం అనేది విద్యకోసం. ఆ విద్య ద్వారా మనం ఏమి కోరుకుంటాం ఏమి సాధిస్తాం? పూర్వం  నారాయణ పండితుడు సంస్కృత భాషలో రచించిన హితోపదేశము లోని ‘మిత్రలాభము’ అనే సందర్భంలో చెప్పిన సుభాషితము ప్రకారం…
విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం |
పాత్రత్వాత్ ధనమాప్నోతి  ధనాద్ధర్మం,తతః సుఖం ||
సరియైన విద్య వినయాన్ని ఇస్తుంది, ఆ వినయం పాత్రతని (అర్హతను) కలగజేస్తుంది, అట్టి పాత్రత ద్వారా ధనం సమకూరుతుంది, వినయమూ పాత్రత ద్వారా సంపాదించిన ధనం ధర్మకార్యాలకి వినియోగింపబడుతుంది, అట్టి ధర్మ కార్యాచరణలు మాత్రమే సుఖాన్ని కలుగజేస్తాయి.ఈ విధముగా ధర్మమార్గం ద్వారా సంపాదించిన ధనముతో సుఖ జీవనంతో పాటుగా, తమ సంతానానికి మంచి విద్యా సౌభాగ్యాలని అందించడానికి, తమ విశ్రాంత జీవితంలో సౌఖ్యముగా జీవించడానికీ వీలు కలుగుతుంది.

 
అసలైన విద్య డిగ్రీలు సంపాదించడం కాదు. అసలైన విద్య యొక్క గమ్యం సత్యశోధన, ధర్మాచరణ, జీవిత పరమార్థం యొక్క అన్వేషణ. ఈ గమ్యాన్ని చేరుకోడానికి అనేక మార్గాలున్నాయి. విద్య గురించి మాట్లాడుతున్నాం కనుక ఈ గమ్యాన్ని చేరుకోవడానికి విజ్ఞానశాస్త్రాలు , మానవీయ శాస్త్రాలు, సంగీతం, సాహిత్యం, 64 కళలు మొదలైనవన్నీ మార్గాలే.!
ఇంకా చెప్పాలంటే మానవ జీవనానికి ‘ధర్మ అర్థ కామ మోక్షాలు’ ఆదర్శాలని అనుభవంతో మన పూర్వీకులు చెప్పారు… చెప్పారు అనడం కన్నా తాము ఆచరించి మనకు నిర్దేశించారు అనడం సరైనది.  ధర్మబద్ధమైన పనులు చేసి అర్ధాన్ని సంపాదించి ధర్మబద్ధంగా తమ కోరికలను తీర్చుకొంటేనే మోక్షానికి అర్హులు అని స్పష్టం చేశారు ‌.
 
ఎవరెవరు తమ వృత్తుల ద్వారా, ప్రవృత్తుల ద్వారా ధర్మాచరణ లేదా ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో కూడా స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసం పాటుపడే వ్యక్తి తన వ్యక్తిగత, కౌటుంబిక ధర్మాచరణ ఎలా ఉండాలి? సమాజానికి ధర్మమార్గాన్ని ప్రబోధించే వర్గప్రజలు ఎలా ఉండాలి.? సమాజానికి సేవ చేసే వ్యక్తుల కార్యాచరణ ఎలా ఉండాలి..? ప్రజలు, సృష్టిలోని జీవుల ఆకలిని తీర్చే వ్యవహారాన్ని నడిపే వర్గపు ప్రజల ధర్మాచరణ ఎలా ఉండాలి అనే విషయాలు కూడా మన పూర్వీకులు తమ జీవితాల్లో ఆచరించి తర్వాత తరాల వారికి ఏనాడో స్పష్టపరిచారు.
 
జీవన విధానాన్ని, నియమాలను, ధర్మాచరణను కలగాపులగం చేసి “సమాజ శ్రేయస్సు” అనే ప్రధానమైన అంశాన్ని పక్కనపెట్టి తమ కుటుంబం కోసం ఆ తర్వాత క్రమంగా దిగజారిపోయి కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా వ్యక్తిగత సుఖం అనే పశుప్రాయమైన భావనకు.., “శరీరము మనస్సు బుద్ధి ఆత్మలు కలిగిన మానవుడికి కేవలం భౌతిక సుఖం మాత్రమే చాలు అనే దుష్ట ప్రచారానికి లోనై వ్యవహరిస్తున్న విధానం అధర్మమైనది…, మన సమాజ నియమాలకు ఆత్మహత్య లాంటిది”.
 
జ్ఞానము, విజ్ఞానము ద్వారా విద్యను పొందడం నుండి అక్షరాస్యుడైతే చాలు అనే ఈ దిగజారుడు  ప్రక్రియ ఎలా జరిగిపోయింది?? ప్రాచీన కాలంలో అక్షరాలే లేవట ముఖే ముఖే సరస్వతి అనే సూత్రాన్ని అనుసరించి మన శాస్త్రాలు వేదాలు వేదాంగాలు అన్ని ముఖతః శిష్యుడికి బోధించినవే అని చరిత్ర తెలియజేస్తున్నది మరి అదంతా అక్షరాలు లేకుండా సాధించిన విద్యయే కదా! అక్షరాస్యత  విద్యను సాధించి ముక్తిని పొందే మార్గం వెతుక్కోవడానికి  ఉపయోగపడుతుంది :

తత్కర్మ యన్న బంధాయ సావిద్యా య విముక్తయే|
ఆయాసాయాపరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణ్యం.||
ఏ పనివలన అయితే మనం బంధింపబడకుండా విముక్తం పొందుతామో అది మంచి కర్మ . దేని వలన అయితే మనకు ముక్తి లభిస్తుందో దానికి తోడ్పడే జ్ఞానం మాత్రమే మనకు ముఖ్యం. మిగిలిన అన్ని పనులు వృధా ప్రయాసలే. మిగిలిన విజ్ఞానమంతా నైపుణ్యం మాత్రమే .స్వాతంత్ర్యానంతరం మనం మన పద్ధతిలో విద్యారంగాన్ని మలుచుకోవడానికి ప్రయత్నించకపోవడం, మన పూర్వులు ఇంత స్పష్టంగా తమ అనుభవాన్ని రంగరించి మనకు నిర్దేశించినప్పటికీ మనం అనవసరమైన అంశాలకు ప్రాధాన్యతనిచ్చి ఇప్పటికీ అక్షరం వస్తే చాలు అనే మాయలో పడిపోయి అసలైన విద్యను సమాజానికి దూరం చేశాము.

 
ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును కోరే నిశ్శ్రేయస సిద్ధి అనగా సమాజానికి అత్యున్నతమైన లాభం, మోక్షసిద్ధి చేకూర్చే విధంగా ఆలోచించగలిగిన వ్యక్తులను రూపొదిద్దుకోవడానికి కావలసిన విద్యను నిర్మాణం చేసుకొని అందించాలి.

              ~