
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయిన ఘటనపై వివిధ దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు. భారత్‌లో ఒక రోజు సంతాప దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇరాన్‌లోని కొంతమంది ప్రజలు మాత్రం ఇబ్రహీం రైసీ మరణాన్ని పండగలాగా జరుపుకున్నారు. రోడ్లపైకి వచ్చి గుంపులు గుంపులుగా ఏర్పడి బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ, మందు తాగుతూ సంబరాలు చేసుకున్నారు.
ఒక అధ్యక్షుడు చనిపోతే ఎవరైనా ఇలా చేస్తారా? అని అనుకోవచ్చు. కానీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇబ్రహీం రైసీ తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ప్రజలు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇబ్రహీం రైసీ మృతి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చాలా మంది ఇరాన్ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
వందలాది మంది ప్రజలు టెహ్రాన్, మషాద్ నగరాల్లోని జంక్షన్‌లకు చేరుకుని గుంపులు గుంపులుగా సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాలుస్తూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఇరాన్‌లో ఉన్న వారు మాత్రమే కాకుండా విదేశాల్లో ఉన్న ఇరాన్ వాసులు కూడా సంబరాలు చేసుకున్నారు.
లండన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం ముందు కొందరు ఇరానీయులు చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. వారిలో కొందరు స్వీట్లు పంచారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతితో సంబరాలు జరుపుకుంటున్న ఘటనలపై మహిళా హక్కుల కార్యకర్త మాసిహ్ అలినేజాద్ ట్విటర్ వేదిగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో బయటపడితే చరిత్రలో ఆందోళన కలిగించే ఏకైక హెలికాప్టర్ ప్రమాదం ఇదే అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ హెలికాప్టర్ డే శుభాకాంక్షలు అంటూ ఆమె ట్వీట్ చేశారు.
అయితే ఇబ్రహీం రైసీ మృతిని అక్కడి ప్రజలు సంబరాలు చేసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్ అధ్యక్షుడిగా 2021 లో ఇబ్రహీం రైసీ ఎన్నికయ్యారు. దీంతో ఇబ్రహీం రైసీ అధ్యక్షుడు అయిన తర్వాత ప్రజల పట్ల చాలా క్రూరంగా వ్యవహరించారని ఇరాన్‌లో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇస్లామిక్ ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అక్కడి వారు పేర్కొంటున్నారు.
ఇందుకు ఉదాహరణే 2022 లో మహ్సా అమినీ అనే యువతిని హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో మోరల్ పోలీసులు తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బలు భరించలేక ఆ యువతి చనిపోయిందని ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అయితే ఈ నిరసనలను అణిచివేసేందుకు ఇబ్రహీం రైసీ మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవడం సంచలనంగా మారింది.
ఇరాక్- ఇరాన్ యుద్ధ సమయంలో పట్టుబడిన యుద్ధ ఖైదీలను ఇబ్రహీం రైసీ దారుణంగా ఉరి వేయించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహీం రైసీ సాగించిన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారిని కూడా ఆయన కఠినంగా శిక్షించినట్లు ఆరోపించారు. ఇబ్రహీం రైసీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు స్థానిక మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మృతిని ఇరాన్ ప్రజలు ఇలా సంబారాలు చేసుకుంటున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
More Stories
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత