లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలుస్తుంది

లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలుస్తుంది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిదేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా వెల్లడించారు. దేశంలో 5వ విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. మంగళవారం ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ క్రమంలోనే ప్రస్తుత ఎన్నికల్లో విజయం బీజేపీదేనని స్పష్టం చేశారు. అయితే లోక్‌సభలో సగం సీట్లే రావాల్సిన బీజేపీ 370 పైగా సీట్లు వస్తాయని రాజకీయ ఉపన్యాసాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా చేసి కమలం పార్టీకి క్రెడిట్ ఇచ్చారు.  ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పిన ప్రశాంత్ కిషోర్.. అయితే ఆ పార్టీ చెప్పినట్లుగా 370 స్థానాలు మాత్రం రాకపోవచ్చని చెప్పారు. 
 
అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో 370, 400 సీట్లు సాధిస్తామని బీజేపీ తెలివిగా వ్యవహరిస్తోందని, అదే రాజకీయాలను, ప్రజలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ఇలా 370, 400 వస్తాయని చెప్పడం.. ఆ పార్టీకి లాభమేనని వెల్లడించారు.  బీజేపీ ఓడిపోతుందా లేదా విజయం సాధిస్తుందా అన్న చర్చ ఎక్కడా లేదని ప్రశాంత్‌ కిషోర్‌ వివరించారు. 
 
కేవలం బీజేపీ 370 సీట్లు సాధిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అయిందని గుర్తు చేశారు. చర్చ కేంద్రకాన్ని చార్‌ సౌ పార్‌ నినాదంతో మోదీ మార్చివేశారన్న ప్రశాంత్‌ కిషోర్‌, ఇందుకు మోదీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే అని చెప్పారు.  గత 3, 4 నెలల నుంచి ఎక్కడ చూసినా 370 సీట్లు, 400 సీట్ల గురించే చర్చ జరుగుతోందని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఇది బీజేపీ వ్యూహంలో భాగమో లేక ప్రతిపక్షాల బలహీనతగా భావించవచ్చని పేర్కొన్నారు. 
 
అయితే ఇది మాత్రం బీజేపీ టార్గెట్‌ను 272 నుంచి 370 కి పెరిగేలా చేసిందని తెలిపారు. ఇది తప్పకుండా బీజేపీకే లాభమని చెప్పారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఓడిపోతారని ఎవరూ చెప్పలేరని,  అయితే బీజేపీకి 320 సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 543 స్థానాలున్న లోక్‌సభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 సీట్లు గెలుచుకుంటే సరిపోతుంది.
 
నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల కొందరు ప్రజలలో కొంతమేరకు కొంత నిరాశ ఏర్పడినా ఆగ్రహం మాత్రం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. మరోవంక, రాహుల్‌ గాంధీ వస్తే పరిస్థితి ఇంకొంత మెరుగవుతుందన్న భావన ఆయన మద్దతుదారుల నుంచి మాత్రమే కనిపిస్తోందని,  క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించలేదని ప్రశాంత్‌ కిషోర్‌ తెలిపారు. 
 
325 లోక్‌సభ స్థానాలు ఉండే ఉత్తర, పశ్చిమ భారతం 2014 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉందని, 225 నియోజకవర్గాలు ఉన్న తూర్పు, దక్షిణ భారతంలో బీజేపీకి ప్రస్తుతం 50 కంటే తక్కువ సీట్లున్నాయని వివరించారు. అయితే ఈసారి దక్షిణాదిలో బీజేపీ కాస్త మెరుగయ్యే అవకాశం ఉందని చెప్పారు. బీజేపీకి నష్టం అంటూ వస్తే అది ఉత్తర, పశ్చిమ భారత్‌లోనే జరుగుతుందని చెప్పారు.

విపక్ష ఇండియా కూటమి బీజేపీని ఎదుర్కొనే అవకాశాలను చాలాసార్లు చేజార్చుకుందని ప్రశాంత్‌ కిషోర్‌ తెలిపారు. ఇండియా కూటమి ఏర్పడే సరికే చాలా ఆలస్యం అవడం ఒక వైఫల్యమన్న ఆయన, అప్పటికే బీజేపీ కోల్పోయిన స్థానాన్ని తిరిగి ఆక్రమించిందని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడం మరింత నష్టానికి దారితీసిందని పేర్కొన్నారు.

ఇండియా కూటమిలో అంతర్గత కుమ్ములాటలను ప్రస్తావిస్తూ సీట్ల సర్దుబాటు విషయంలో ఎస్పీ, టీఎంసీతో విభేదాలను వివరించారు. నోట్ల రద్దు తర్వాత గుజరాత్‌లో బీజేపీ ప్రాభవాన్ని కోల్పోయినా, కరోనా తర్వాత బంగాల్‌లో బీజేపీ తీవ్ర నష్టాన్ని చవిచూసినా ఆ రెండు అవకాశాలను కాంగ్రెస్‌ చేజార్చుకుందని తెలిపారు. క్యాచ్‌లను మిస్‌ చేస్తూ ఉంటే బ్యాట్స్‌మెన్‌ సెంచరీలు చేస్తూనే ఉంటారని వివరించారు.