* తన కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారన్న స్వాతి
సంచలనం సృష్టించిన ‘ఆప్’ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి విషయంలోఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మంగళవారంనాడు తొలిసారి స్పందించారు. ముఖ్యమంత్రి సాచివేత ధోరణతో వ్యవహరించకుండా తమ తప్పేమీ లేదని నిరూపించుకోవాలని హితవు చెప్పారు. ఈ ఘటనపై కేజ్రీవాల్ ఇంతవరకూ స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు.
స్వాతి మలివాల్‌కు ఎదురైన బాధాకరమైన అనుభవం, సహచర నేతల నుంచి ఎదురవుతున్న బెదిరింపులు చూసి తాను ఆవేదన చెందినట్టు ఢిల్లీ రాజ్‌భవన్ నుంచి విడుదల చేసిన లేఖలో వీకే సక్సేనా పేర్కొన్నారు. సోమవారంనాడు తనకు స్వాతి మలివాల్ ఫోను చేసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని, తనకు ఎదురైన అత్యంత భాదకరమైన అనుభవనాన్ని పంచుకున్నారని ఆయన తెలిపారు.
సొంత సహచరుల నుంచే ఇలాంటి అనుభవాన్ని ఆమె ఎదుర్కోవడం సిగ్గుచేటని ఆయన విచారం వ్యక్తం చేశారు. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలు, తనకు వస్తున్న బెదరింపులపై కూడా స్వాతి మలివాల్ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఎల్జీ చెప్పారు.
“కనీసం ఇప్పటికై మా ముఖ్యమంత్రి సాకుల కోసం వెతుక్కోకుండా తమ తప్పేమీ లేదని నిరూపించుకుంటారని ఆశిస్తున్నాను. ఆయన మౌనం వల్ల మహిళల భద్రతపై అనుమానాలు మరింత ఇబ్బడిముబ్బడి అవుతాయి” అని ఆ లేఖలో ఎల్జీ పేర్కొన్నారు. స్వాతి మలివాల్ గతంలో తనపైన, తన కార్యాలయాన్ని గుడ్డిగా విమర్శిస్తూ వస్తున్నారని, అయినప్పటికీ మలివాల్‌ను శారీరక హింసకు గురిచేయడం క్షమించరాని నేరమని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఎల్జీ స్పష్టం చేశారు.
కాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖ రాసిన కొద్ది సేపటికే ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. బీజేపీతో కలిసి స్వాతి మలివాల్ పనిచేస్తోందనడానికి, ఎన్నికల్లో ప్రతిరోజూ ఆప్‌పై ఏదో ఒక కొత్త కుట్రతో వస్తోందనే విషయం ఎల్జీ లేఖలో రుజువైందని ఆ పార్టీ మండిపడింది. ”మోదీ మునిగిపోతున్న పడవకు స్వాతి మలివాల్ మద్దతుగా నిలుస్తున్నారు. స్వాతి మలివాల్‌ను అడ్డుపెట్టుకుని ఆయన (మోదీ) ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు” అని విమర్శించింది.
ఇలా ఉండగా, ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఆరోపించారు. దీనివల్ల తన కుటుంబానికి ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడి విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలైన వాహన నెంబర్లు మొదలైన వాటిని లీక్ చేయడాన్ని ఆమె ప్రశ్నించారు.
ఎక్స్ వేదికగా మాట్లాడుతూ “ నేను అవినీతికి పాల్పడినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, ఢిల్లీ మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ సూచనల మేరకే చేశానని పుకార్లు సృష్టిస్తున్నారు. 2016లో నా మీద నమోదైన కేసుకు వ్యతిరేకంగా న్యాయబద్ధంగా పోరాటం చేశాను. అది తప్పుడు కేసని కొట్టేసింది” అంటూ ఆమె వివరణ ఇచ్చారు.
ఆ సమయంలో ఆప్ నేతలు తనను లేడీ సింగం అని పొగిడారని ఆమె గుర్తు చేశారు. వారికి నేనిప్పుడు బీజేపీ ఏజెంట్‌గా కనిపిస్తున్నానా? అని ఆప్ వర్గాలను ఆమె నిలదీశారు. ఢిల్లీ మంత్రులు అధికారమత్తులో ఉన్నారని పేర్కొంటూ నిజం ఎప్పుడైనా బయటపడుతుందని ఆమె భరోసా వ్యక్తం చేశారు. వారు చెప్పే ప్రతి అబద్ధానికి కోర్టుకు లాగుతానని ఆమె హెచ్చరించారు.
నిజం మాట్లాడినందుకు పార్టీ మొత్తం తనపై ట్రోల్ చేస్తోందని, పార్టీ లోని ప్రతి ఒక్కరినీ పిలిచి తన వ్యక్తిగత వీడియోలు ఉంటే పంపించమని చెబుతూ వాటిని లీక్ చేస్తున్నారని ఆమె విమర్శించారు. స్వాతి మాలీవాల్ పై జరిగిన దాడి సంఘటనపై దర్యాప్తునకు ఢిల్లీ పోలీస్‌లు తాజాగా సిట్ ఏర్పాటు చేశారు. దీనికి నార్త్ ఢిల్లీ అడిషనల్ డిప్యూటరీ కమిషనర్‌ఆఫ్ పోలీస్ అంజిత చెప్యాల నేతృత్వం వహిస్తారు. దీనితోపాటు సిట్‌లో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారులను చేర్చారు.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం