ఇసుక అక్రమ తవ్వకాలపై జగన్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్​లో నది భూగర్భ జలాల్లో ఇతర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఎన్జీటీలో నరేంద్ర కుమార్‌ అనే వ్యక్తితో పాటు పలు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసం విచారణ జరిపింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై మండిపడ్డ సుప్రీంకోర్టు అనుమతులు లేకుండా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.

ఎన్జీటీ తీర్పును యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  అక్రమ ఇసుక తవ్వకాలపై తీసుకున్న చర్యలపై మే 9లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్ర పర్యావరణ, అటవీశాఖను ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని జేపీ వెంచర్స్​కి కూడా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసిన సుప్రీం అనుమతులు ఉన్న చోట మ్యానువల్​గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని ఆదేశించింది. పిటిషనర్ నరేంద్రకుమార్‌ ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. 

అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడిన వారిపై ఎఫ్​ఐఆర్ దాఖలు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలుకు ఎక్కువ సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ణప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యమని స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం తదుపరి విచారణ మే 10కి వాయిదా వేసింది.