జూన్ 1 వరకు సీఎం జగన్ విదేశీ పర్యటన

కీలకమైన ఎన్నికల పోలింగ్ ముగియడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 16 నుండి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. పర్యటనలో భాగంగా జగన్ యూకే, స్విస్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. అంటే, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండడంతో, ఎన్నికల ఫలితాలకు ముందుగా స్వదేశంకు తిరిగిరానున్నారు.

యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో 17 రోజులు కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు న్యాయస్థానం సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ కు 2013లో బెయిల్ ఇచ్చిప్పుడు దేశం విడిచి వెళ్లరాదని సీబీఐ కోర్టు షరతు విధించింది. ఫ్యామిలి వెకేషన్ కోసం భార్య భారతి, కుమార్తెతో కలిసి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు.

కేసు అభియోగాల నమోదు దశలోనే ఉన్నందున తాను విదేశాలకు వెళ్తే ట్రయల్ పై ప్రభావం ఉండదని కోర్టుకు తెలిపారు. కోర్టు ఎలాంటి షరతులు విధించినా పాటిస్తానని, విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. గతంలోనూ కోర్టు అనుమతితో పలు మార్లు విదేశాలకు వెళ్లి వచ్చినట్లు వివరించారు. 

జగన్ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్, ఇతర నిందితులు కుంభకోణానికి పాల్పడి ఆర్థికంగా అక్రమ లబ్ధి పొందారని సీబీఐ వాదించింది. ఏదో ఒక కారణంతో జగన్ తరచుగా విదేశాలకు వెళ్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చింది. జగన్ సీఎం అయిన తర్వాత ఒకే సారి కోర్టుకు వచ్చారని వాదించింది. జగన్, ఇతర నిందితులు వివిధ పిటిషన్లు వేసి కేసు విచారణ జాప్యం చేస్తున్నారని గతంలో హైకోర్టు ప్రస్తావించిందని సీబీఐ పేర్కొంది. 

తీవ్రమైన ఆర్థిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ విచారణలో జాప్యాన్ని సాకుగా చూపి.. మినహాయింపులు, సడలింపు కోరడం సరికాదని వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు జగన్ 17 రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. విదేశాలకు వెళ్లే ముందు తన ప్రయాణ వివరాలు, ఫోన్ నంబర్లు, మెయిల్ కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని జగన్ ను న్యాయమూర్తి ఆదేశించారు.