కేరళ యూనివర్సిటీలో సీపీఎం నేత ప్రసంగంపై దుమారం

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కాగలదని వైస్ ఛాన్సలర్ అభ్యంతరం వ్యక్తం చేసిన్నప్పటికీ సిపిఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ కేరళ విశ్వవిద్యాలయంలో రాజకీయ ప్రసంగం చేయడం వివాదాస్పదమైంది. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు సంజాయిషీ నోటీసు పంపింది.

కేరళ యూనివర్సిటీ ఉద్యోగుల సంఘం నెలవారీ కార్యక్రమంలో భాగంగా `భారత ప్రజాస్వామ్యం .. సవాళ్లు, బాధ్యతలు’ అనే అంశంపై జాన్ బ్రిట్టాస్ ప్రసంగించారు. యూనివర్సిటీ ఆవరణలోని యూనియన్ కార్యాలయంలో ఈ సమావేశం జరిపారు. ఈ సమావేశం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కాగలదని పేర్కొంటూ, దానిని జరగనీయవద్దని వైస్ ఛాన్సలర్ మోహనన్ కనుముల్ రిజిస్ట్రార్ ను ఆదేశించారు.

పైగా, ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వచ్చి, ఎన్నికల విధులలో పాల్గొనబోయే ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమే కాగలదని ఆయన స్పష్టం చేశారు.  ఈ లోగా ఎంపీ అక్కడకు వచ్చి ప్రసంగం చేశారు. తన ప్రసంగంలో ప్రధానమంత్రి, బిజెపి, వైస్ ఛాన్సలర్ లపై విమర్శలు గుప్పించారు. 

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  చట్టాన్ని ఉల్లంఘించడాన్ని కొందరు తమ హక్కుగా భావిస్తారని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ విమర్శించారు. ఈ విషయంలో యూనివర్సిటీ నుంచి వివరణ కోరనున్నట్లు గవర్నర్‌ తెలిపారు. 

గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తించాలి. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎన్నికల ప్రచారంపై పూర్తి నిషేధం ఉంది. అటువంటి పరిస్థితిలో, విశ్వవిద్యాలయ పరిపాలన ఈ నిషేధాన్ని విస్మరించి, ఎవరైనా సమావేశాన్ని నిర్వహించడానికి అనుమతిస్తే.. నేను వివరణ కోరాల్సి ఉంటుంది” అని స్పష్టం చేశారు. 

“కానీ, నాకు తెలిసినంత వరకు, విశ్వవిద్యాలయ పరిపాలన సమావేశం నిర్వహించడానికి నిరాకరించింది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి. సమస్య ఏమిటంటే కొంతమంది చట్టాన్ని ఉల్లంఘించడం తమహక్కుగా భావిస్తారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  వాస్తవానికి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనల ప్రకారం ప్రభుత్వ సంస్థల్లో ఎన్నికల ప్రచారం చేయడం నిషేధం. అయితే, ఇది నెలవారీ కార్యక్రమమని, ఇది ప్రజా కార్యక్రమం కాదని అసోసియేషన్ పేర్కొంది. ఈ అంశం వివాదాస్పదం కావడం, ఎన్డీయే ఫిర్యాదు చేయడంతో ఈసీ సైతం నోటీసులు జారీ చేసింది.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కు రిజిస్ట్రార్ ఇచ్చిన సమాధానం సిపిఎం ఎంపీ సమావేశాన్ని సమర్ధించే విధంగా ఉండటం గమనార్హం. అక్కడ ఆయన ఎటువంటి రాజకీయ ప్రసంగం చేయలేదని తెలిపారు. ఎవ్వరికైనా ఓటు వేయమని అడిగిన్నట్లు తెలియదని అంటూ చెప్పుకొచ్చారు. అయితే  ఎన్నికల కమిషన్ కు చేసిన ఫిర్యాదుతో పాటు అందజేసిన వీడియో క్లిప్ లో రాజకీయ ప్రసంగం చేయడం, ఎన్నికల గురించి మాట్లాడటం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం స్పష్టంగా వెల్లడైంది.