ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లకు అమిత్ షా భరోసా

ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లను తొలగించబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని.. విపక్షాలు కోరుతున్నా తాము మాత్రం రిజర్వేషన్లను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. 

రాజస్థాన్‌లోని కోటాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కోటా లోక్‌సభ అభ్యర్థిగా ఓం బిర్లాకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందినవారని, అందుకే వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోందని అమిత్ షా తెలిపారు. 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ కోరినా, తాము అలా చేయం అని చెప్పారు. ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. ఓబీసీ వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. గతంలో యూపీఏ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు చేయలేదని విమర్శించారు.  అంతేకాకుండా పార్లమెంటులో నిర్వహించిన చర్చలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రెండున్నర గంటల పాటు రిజర్వేషన్ల అంశంపై వ్యతిరేకంగా మాట్లాడారని అమిత్ షా గుర్తు చేశారు. 

ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ గుర్తింపు కల్పించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ప్రతి 3 నెలలకు ఒకసారి విదేశాలకు వెళ్తారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయని.. ప్రియాంక గాంధీ వాద్రా థాయ్‌లాండ్ నుంచి తిరిగి వచ్చారని దుయ్యబట్టారు.

దేశ ప్రజలపై వారికి ప్రేమ లేదని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులు చొరబడి దాడులు చేసేవారని, మోదీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదని చెప్పారు. అన్ని కేంద్ర సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషిచేసినట్లు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ గత పదేళ్లలో నెరవేర్చామని వెల్లడించారు.

2019 ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటు వేసి ఉంటె కోట పిఎఫ్ఐ ఉగ్రవాదులకు నిలయంగా మారి ఉండేదని చెబుతూ బిజేపికి ఓటు వేయడంతో పిఎఫ్ఐ పై నిషేధం విధించామని హోంమంత్రి తెలిపారు. కాంగ్రెస అభివృద్ధి వ్యతిరేక పార్టీ అంటూ దుయ్యబట్టారు.  2014, 2019లలో బిజెపికి పూర్తి మెజారిటీ ఇవ్వడంతో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, పౌరసత్వ సవరణ అమలు వంటి చర్యలు చేపట్టగలిగామని గుర్తు చేస్తూ కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఇటువంటి పనులు చేయగలిగేవారా? అని ప్రశ్నించారు.

కాగా, ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన తొలి దశ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్-సమాజ్‌వాది(ఎస్‌పి) కూటమి తుడిచిపెట్టుకుపోయిందని  అమిత్ షా తెలిపారు. మథుర నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న సిట్టింగ్ ఎంపి హేమమాలిని తరఫున బృందావనంలో ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌ను యువరాజులుగా ఆయన అభివర్ణించారు.
 
రూ.. 12 లక్షల కోట్ల కుంభకోణాలు, అవినీతికి పాల్పడిన కాంగ్రెస్, ఎస్‌పి ఒకవైపు, 23 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్కపైసా అవినీతి మరక అంటని నరేంద్ర మోదీ మరో వైపు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు రెండు శిబిరాలు ఉన్నాయని, పేద కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ   ఒకవైపు, సంపన్న కుటుంబంలో జన్మించిన రాహుల్ గాంధీ మరో వైపు ఉన్నారని, ఆ ఇద్దరిలో ఒకరిని ప్రజలే ఎంచుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు.