క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో మార్పులకు సిద్ధం

క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో మార్పులకు సిద్ధం
క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో గణనీయమైన మార్పులకు భారతదేశం సిద్ధంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. ‘క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్‌లో భారతదేశ ప్రగతిశీల మార్గం’ అనే అంశంపై కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సీజేఐ ప్రారంభోపన్యాసం చేశారు. 

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలపై అవగాహన కల్పించేందుకు న్యాయమంత్రిత్వ శాఖ సదస్సును నిర్వహించింది. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్‌ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను కేంద్రం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 

కొత్తగా అమలులోకి వచ్చిన చట్టాలు నేర న్యాయంపై భారతదేశం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కొత్త యుగంగా మార్చాయని చంద్రచూడ్ తెలిపారు. బాధితుల ప్రయోజనాలను కాపాడేందుకు, నేరాలపై విచారణ జరిపేందుకు ఈ మార్పు చేయడం చాలా ముఖ్యమని చెప్పారు. 

కొత్త చట్టాలకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడం దేశం మారుతున్నదని, పురోగమిస్తోందనడానికి సంకేతమని.. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త చట్టపరమైన చర్యలు అవసరమని సీజేఐ పేర్కొన్నారు. కొత్త క్రిమినల్ చట్టాల ద్వారా తీసుకువచ్చిన మార్పుల నుంచి దేశం పూర్తిగా ప్రయోజనం పొందేలా అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. 

ఫోరెన్సిక్ నిపుణులు, పరిశోధకులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మన కోర్టు వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సదస్సులో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పాల్గొన్నారు.